గురువారం 04 జూన్ 2020
Cinema - May 13, 2020 , 22:54:58

స్టార్‌ హీరోలు మారాలి

స్టార్‌ హీరోలు మారాలి

మహిళా ప్రధాన చిత్రాల విషయంలో అగ్రకథానాయకుల ఆలోచనా ధోరణిలో  మార్పులు రావాల్సిన అవసరముందని అంటోంది ముంబయి సొగసరి కృతిసనన్‌. ‘వన్‌ నేనొక్కడినే’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్‌ బాట పట్టింది. కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ప్రయోగాలకు సిద్ధపడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సరోగసీ  ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ‘మిమి’ చిత్రంలో  తల్లి పాత్రలో నటిస్తోంది కృతిసనన్‌. మహిళా ప్రధాన ఇతివృత్తాలకు స్టార్స్‌ ప్రోత్సాహాన్ని అందించాలని చెబుతోంది. కృతిసనన్‌ మాట్లాడుతూ “మిమి’ అంగీకరించిన తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ సినిమా అని తెలిసి కూడా   చాలా మంది సినిమాలో హీరో ఎవరు?ఎవరి సరసన నటిస్తున్నావు?అడిగారు. వారికి ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు. ఆ ప్రశ్న ఎదురైన ప్రతిసారి మనసుకు బాధ కలిగేది. హాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో స్టార్‌ హీరోలు చిన్న పాత్రలైనా చేయడానికి సంసిద్ధంగా ఉంటారు.  భారతీయ చిత్రసీమలో అగ్ర నటులు మాత్రం వెనకాడుతున్నారు’ అని తెలిపింది. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాయ్స్‌ లాకర్‌ రూమ్‌ ఘటనపై  కృతిసనన్‌ స్పందిస్తూ ‘ ఏ విషయమైన హద్దులకు  లోబడి ఉన్నంతవరకే  బాగుంటుంది.  అమ్మాయిల్ని గురించి వర్ణిస్తున్నప్పుడు అందంగా  ఉందని చెప్పడం వరకు సబబే  ఆ పరిమితులు దాటితే ఇబ్బందులు తప్పవు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి సోషల్‌మీడియాలో తేలికగా మాట్లాడటం ఆవేదనను కలిగిస్తోంది.  వక్రబుద్ధితో ఆలోచించే వారిలో మార్పు రావడం సులభం కాదు.  పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చూపించే వివక్ష వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మగపిల్లల్ని  గొప్పవాళ్లుగా భావిస్తూ ఆడపిల్లల్ని  చులకన చేస్తున్నారు.  వారి స్వేచ్ఛను హరిస్తున్నారు.  మహిళల్ని, పెద్దవాళ్లను గౌరవించే ధోరణిని మగపిల్లలో తల్లిదండ్రులు అలవర్చాలి. సెక్స్‌ ఎడ్యుకేషన్‌,  లింగవివక్ష పట్ల చిన్నతనం నుంచే అవగాహన కల్పించడం ముఖ్యం’ అని తెలిపింది.   logo