తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అత్యంత సహజ నటుల్లో నాని కూడా ఉంటాడు. ఈయన స్క్రీన్‌పై నటిస్తుంటే అలా చూస్తూ ఉండిపోతారు. తెరపై యాక్ట్ చేసినట్టు కాకుండా సహజంగా ఉంటాడు నాని. అందుకే ఈయనను నాచురల్ స్టార్ అంటారు. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నాని.. ఈ రోజు స్టార్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో వెలుగొందుతున్నాడు. వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈయనకు సెలబ్రిటీల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.
తాజాగా ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ నానిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసింది. అది ఆయన చూసుకోవడమే కాకుండా వాళ్లకు రిప్లై కూడా ఇచ్చాడు. ఆ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తెలుగు యువకుడు హరి శంకర్ రెడ్డి ఎంపికయ్యాడు. ఈ రాయలసీమ కుర్రాడిని ధోని జట్టు సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీంకు ఎంపికైన తర్వాత ఎలాంటి అనుభూతిని ఫీలయ్యాను అనేది ఒక వీడియో చేసి పోస్ట్ చేశాడు శంకర్. అది అచ్చంగా నాని సినిమా మాదిరే ఉంది అని చెప్పుకొచ్చాడు.
తాను నాచురల్ స్టార్ నాని అభిమానిని అని.. జెర్సీ సినిమాలో టీంలోకి సెలెక్ట్ అయినప్పుడు నాని ట్రైన్ దగ్గరికి వచ్చి అరిచే సన్నివేశం తన జీవితంలో కూడా జరిగింది అంటున్నాడు. చెన్నై టీం కు ఎంపికైన ఆ క్షణం తన గదిలోకి వెళ్లి గట్టిగా అరిచాను అని చెప్పాడు హరి శంకర్ రెడ్డి. సినిమాలో నాని అలా అరిస్తే ఓవరాక్షన్ అని అందరూ అనుకుంటారు కానీ అది ఎంత విలువైన క్షణం అనేది తన లాంటి ఆటగాళ్లకు బాగా తెలుస్తుంది అని.. తన జీవితంలో అది బాగా కనెక్ట్ అయింది అని చెప్పాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేయడమే కాకుండా నానిని చూడమని చెప్పారు. దానికి నాచురల్ స్టార్ కూడా చూసేశా అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ సినిమాకు ఈ మధ్యే రెండు నేషనల్ అవార్డులు వచ్చాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి