Nagarjuna | మంత్రి కొండా సురేఖ , టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. నాగార్జున ఇప్పటికే మంత్రి వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసి కోర్టులో పోరాడుతుండగా, సురేఖ తాజాగా అర్థరాత్రి చేసిన ట్వీట్ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ మంత్రి కొండా సురేఖ అర్థరాత్రి 12 గంటల తర్వాత తన అధికారిక ట్విట్టర్ (X) ఖాతాలో క్షమాపణ లేఖను పోస్ట్ చేశారు. “నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను కించపరచాలనే ఉద్దేశ్యం నాకు లేదు. నా వ్యాఖ్యల వల్ల వారు మనస్తాపానికి గురై ఉంటే చింతిస్తున్నాను” అని పేర్కొన్నారు. అలాగే, “ఆ వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నాను” అని స్పష్టం చేశారు.
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవగా, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె పశ్చాత్తాపాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు “ఇప్పుడు ఎందుకు?” అని ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విమర్శలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో ఆమె నాగచైతన్య – సమంత విడాకులు గురించి ప్రస్తావిస్తూ, “కేటీఆర్ వల్లే వారు విడిపోయారు” అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో అక్కినేని అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున స్వయంగా స్పందిస్తూ, “నా కుటుంబ గౌరవం, వ్యక్తిగత జీవితం రాజకీయాల కోసం ఉపయోగించడం తగదు” అని అన్నారు. అనంతరం ఆయన మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా దాఖలు చేశారు.
ప్రస్తుతం ఈ పరువునష్టం దావా కోర్టులో విచారణలో ఉంది. ఇంతలో సురేఖ పబ్లిక్‌గా క్షమాపణ చెప్పడం, కేసు ఫలితంపై ప్రభావం చూపుతుందా అనే దానిపై న్యాయవర్గాల్లో చర్చ మొదలైంది. కొందరు న్యాయ నిపుణులు “ఇది మంచి సంకేతం కానీ కేసు వెనక్కి తీసుకోవడానికి కుదరదు” అని అంటున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి నాగార్జున వైపే ఉంది. మంత్రి చెప్పిన క్షమాపణను ఆయన కుటుంబం ఎలా స్వీకరిస్తుందో చూడాలి. నాగార్జున ఈ క్షమాపణను అంగీకరిస్తారా? లేక కేసు కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు అభిమానులను, మీడియాను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.
I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members.
I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members.
I regret any unintended impression…
— Konda Surekha (@iamkondasurekha) November 11, 2025