గురువారం 26 నవంబర్ 2020
Cinema - Mar 10, 2020 , 23:09:11

అతడే..చెలికాడు

అతడే..చెలికాడు

మీ జతగాడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటారని అడిగితే...కొందరు నాయికలు ముక్తసరిగా సమాధానమిస్తారు. మరికొందరేమో చాంతడంతా లిస్ట్‌ను చదివేస్తారు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా అద్వాణీ రెండోరకం. ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఈ అమ్మడికి ఇదే ప్రశ్న ఎదురైంది. ఆమె పేర్కొన్న లక్షణాలు విని...అసలు ఇలాంటి యువకులు ఈరోజుల్లో దొరకడం సాధ్యమా అంటూ ఆశ్చర్యపోయారట. ఇంతకి ఈ సుందరి ఏం చెప్పిందంటే..‘అన్నింటికంటే ఆ వ్యక్తిలో విధేయత ఉండాలని కోరుకుంటా. నన్ను బాగా నవ్వించగలగాలి. 


నా జోక్స్‌కు తానూ నవ్వాలి. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో కాకుండా స్వయంకృషితో ఎదిగినవాడై ఉండాలి. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా దయార్థ్రహృదయాన్ని ప్రదర్శించాలి’ అంటూ నాన్‌స్టాప్‌గా సదరు చెలికాడి లక్షణాల్ని వల్లెవేసింది. చివరగా అన్నింటి కంటే అతగాడిలో నిజాయితీ ముఖ్యమని, అది కొరవడితే ఎన్ని ఉత్తమ లక్షణాలున్నా వృథాయే అంటూ ముక్తాయింపునిచ్చింది. ప్రస్తుతం ఈ సుందరి హిందీలో షేర్షా, లక్ష్మీబాంబ్‌, ఇందూ కి జవానీ, బూల్‌బులయ్యా-2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ‘షేర్షా’ కథానాయకుడు సిద్ధార్థమల్హోత్రాతో ఈ వయ్యారి ప్రేమలో ఉందని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై మాట్లాడటానికి ఈ సుందరి సున్నితంగా తిరస్కరించింది.