ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 14:55:24

ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌ల‌తో సినిమా.. స్పందించిన కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు

ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌ల‌తో సినిమా.. స్పందించిన కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు

కేజీఎఫ్ చిత్రంతో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్‌. ప్ర‌స్తుతం ఆయ‌న  కేజీఎఫ్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు.  క‌ల్ట్ మూవీగా అభివర్ణించ‌బ‌డిన ఈ చిత్రం లాక్‌డౌన్ వ‌ల‌న కొంత ఆల‌స్యంగా విడుద‌ల కానుంది. చిత్ర షూటింగ్ విష‌యానికి వ‌స్తే  ఇప్ప‌టికే అందరు ఆర్టిస్ట్‌ల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించిన ద‌ర్శ‌కుడు అధీరా అనే పాత్ర‌లో న‌టిస్తున్న  సంజ‌య్ ద‌త్ పై యాక్ష‌న్ స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించి ఈ చిత్ర షూటింగ్‌కు ప్యాక‌ప్ చెప్ప‌నున్నాడు. క‌ట్ చేస్తే కేజీఎఫ్ 2 త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ఎవ‌రితో చేయ‌నున్నాడ‌నే చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా సాగుతుంది.

మే 20న ఎన్టీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దర్శకుడు ప్రశాంత్‌నీల్ ట్వీట్ చేశారు. ‘మీరు పక్కనుంటే న్యూక్లియర్‌ ప్లాంట్‌ దగ్గర కూర్చున్న భావన కలుగుతుంది. త్వరలో రేడియేషన్‌ సూట్‌ ధరించి మీ వద్దకు రాబోతున్నా’ అని ప్రశాంత్‌నీల్ కామెంట్ చేశాడు. అలానే జూన్ 4న ప్ర‌శాంత్ నీల్ ‌ జన్మదినోత్సవాన్ని పుర‌స్క‌రించుకొని  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్‌  ‘గొప్ప మనసు కలిగిన సంచలన దర్శకుడికి శుభాకాంక్షలు. త్వరలో మిమ్మల్ని రేడియేషన్‌ సూట్‌లో కలవబోతున్నాం’ అని తమ అధికారిక ఖాతాలో ట్వీట్‌ చేయడం మరింత ఉత్కంఠను రేపింది. దీంతో మైత్రి మూవీ మేక‌ర్స్ ఎన్టీఆర్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రేడియేష‌న్ అనే సినిమా చేయ‌బోతున్న‌ట్టు చ‌ర్చ న‌డుస్తుంది. 

తాజాగా ఓ నెటిజ‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా మీరు కేజీఎఫ్ 2 చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్‌తో సినిమా చేస్తారా, లేక ఎన్టీఆర్‌తో చేస్తారా అని ప్ర‌శ్నించారు. దీనికి స్పందించిన ప్ర‌శాంత్ నీల్..  ``కేజీఎఫ్-2` చిత్రానికి సంబంధించి నా బాధ్య‌త‌ పూర్తయిన తర్వాత మాత్రమే  తర్వాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడతాన`ని రిప్లై ఇచ్చాడు. logo