ఆదివారం 31 మే 2020
Cinema - Apr 25, 2020 , 23:20:53

విజయనిర్మల బయోపిక్‌?

విజయనిర్మల బయోపిక్‌?

‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రకు ప్రాణప్రతిష్ట చేస్తూ అద్భుతాభినయాన్ని కనబరచి జాతీయ ఉత్తమనటిగా అవార్డును సొంతం చేసుకుంది కీర్తి సురేష్‌. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగిపోయింది. ఈ సినిమా నుంచి కథాంశాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోందామె.  వైవిధ్యమైన ఇతివృత్తాలు, పాత్ర చిత్రణలో కొత్తదనం ఉంటేనే సినిమాల్ని అంగీకరిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రముఖ దర్శకురాలు, నటి దివంగత విజయనిర్మల బయోపిక్‌లో కీర్తి సురేష్‌ నటించబోతున్నట్లు తెలిసింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా భారతీయ చిత్రసీమపై చెరగని ముద్రవేశారు విజయనిర్మల. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. విజయనిర్మల జీవితకథను తెరకెక్కించేందుకు ఆమె తనయుడు నరేష్‌ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇందుకోసం ఆయన కీర్తి సురేష్‌ను సంప్రదించారని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో వెలువడుతుందని సమాచారం. ప్రస్తుతం తెలుగులో రంగ్‌దే, మిస్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది కీర్తి సురేష్‌.


logo