ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 00:05:40

టాలీవుడ్‌కు కేసీఆర్‌ అండదండలు ఇక సినిమా హిట్‌

టాలీవుడ్‌కు కేసీఆర్‌ అండదండలు ఇక సినిమా హిట్‌

చిత్రపరిశ్రమకు వరాలపై సినీ సంఘాల హర్షం

చెప్పిన పనులన్నీ చేసిన సీఎం కేసీఆర్‌

సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మంచి పనులు కేసీఆర్‌ చేస్తున్నారని నిర్మాత సి.కల్యాణ్‌ అన్నారు. అడిగిన వెంటనే సినీ పరిశ్రమలోని సమస్యలన్నీ పరిష్కరిస్తుండటం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల పట్ల చిత్రసీమలోని తెలుగు, తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్‌లతో పాటు ఇతర అధికారిక సంఘాలన్నీ ఆనందాన్ని వ్యక్తంచేశాయి. మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమైన ఇండస్ట్రీలోని అన్ని సంఘాలవారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మంచి పనులు తెలుగు సినిమా పరిశ్రమకు కేసీఆర్‌గారు చేయడం ఆనందదాయకం. సినిమా ఇండస్ట్రీకి కేసీఆర్‌గారు ఇచ్చిన మ్యానిఫెస్టో ఇది. రెండున్నర గంటల పాటు మా సమస్యల్ని విన్న ముఖ్యమంత్రి గారు కరోనా మూలంగా ఇండస్ట్రీలోని ఏ విభాగాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి? వేటిని అభివృద్ధి చేయాలో క్షుణ్ణంగా చర్చించారు. మల్టీపుల్‌ షోస్‌కు అనుమతులు ఇవ్వడం ఆనందంగా ఉంది. దీని వల్ల పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు లాభం కలుగుతుంది.  సింగిల్‌స్క్రీన్స్‌లలో మల్టీపుల్‌ షోస్‌కు అనుమతి ఇచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణనే.  పదికోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందే చిన్న సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం వల్ల నిర్మాతలకు లాభం కలుగుతుందని  చెప్పగానే ముఖ్యమంత్రి వెంటనే అనుమతి ఇచ్చారు. చిన్న సినిమా విజయవంతం కావడం వల్ల నిర్మాతకు వచ్చే లాభానికి సమానంగా ప్రభుత్వం నుంచి రీయింబరెన్స్‌మెంట్‌ అందుతుంది.  ఈ రీయింబరెన్స్‌మెంట్‌ వల్ల ఉపాధి పెరిగి కృష్ణానగర్‌ మళ్లీ కళకళలాడుతుంది. సినీ కార్మికులకు రేషన్‌, హెల్త్‌ కార్డులు ఇవ్వడానికి వెంటనే సుముఖత వ్యక్తంచేయడం ఆనందంగా ఉంది. థియేటర్లు పునఃప్రారంభమైన తర్వాత మంత్రులందరితో కలిసి తాను థియేటర్‌లో సినిమా చూస్తానని ముఖ్యమంత్రి చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది.  మంచి తేదీ చూసుకొని ఇండస్ట్రీ తరఫున పెద్ద వేడుకను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఆనందపడేలా  ఆయన్ని సత్కరించబోతున్నాం. ఈ వేడుక ద్వారా ఆయనకు కృతజ్ఞతను చెప్పాలనుకుంటున్నాం’ అని తెలిపారు. 

అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కేసీఆర్‌

దామోదరప్రసాద్‌ మాట్లాడుతూ ‘కరోనా ప్రభావం మూలంగా సినీ పరిశ్రమ చాలా నష్టపోయింది. ఇండస్ట్రీని కాపాడుకోవాలనే తపనతో చిరంజీవి, నాగార్జున చొరవ తీసుకొని సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్ని పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి మాటిచ్చారు. అన్నట్లుగానే థియేటర్ల పునఃప్రారంభానికి సంబంధించిన జీవోను జారీ చేశారు. అలాగే మినిమం కరెంటు ఛార్జీల రద్దు, టికెట్‌ రేట్ల సవరణ, చిన్న సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌  ఇస్తామని ప్రకటించారు. ఇండస్ట్రీ తరఫున ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాం. ఒప్పుకున్న అన్ని పనుల్ని ఒకే సారి అమలుపరచడం అరుదుగా జరుగుతుంది. ఆ అసాధ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుసాధ్యం చేసి చూపించడం ఆనందంగా ఉంది. రెండు రాష్ర్టాల నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కూర్చొని సమావేశమైన తర్వాతే థియేటర్లు ఎప్పుడు తెరిచేది నిర్ణయిస్తాం.  విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల్ని ఎలా సర్దుబాటు చేయాలో చర్చిస్తాం. వాటికి సంబంధించిన విషయాల్ని మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయిస్తాం’ అని తెలిపారు.  

ఇండస్ట్రీ పురోభివృద్ధి కోసం కేసీఆర్‌ చక్కటి నిర్ణయాలు తీసుకున్నారని,  చెప్పివవన్నీ కేసీఆర్‌ అమలు చేస్తారనే నమ్మకముందని తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు మురళీమోహన్‌ చెప్పారు.   మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ జీవిత మాట్లాడుతూ ‘చెప్పింది చేసే గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈ వరాల వల్ల ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుంది’ అని చెప్పారు.  సినీ రంగంలోని సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చక్కటి కృషిచేస్తున్నారని ఫిలిం ఫెడరేషన్‌ అధ్యక్షుడు కొమర వెంకటేష్‌ కొనియాడారు.

డైనమిక్‌ సీఎం కేసీఆర్‌

నిర్మాత, పంపిణీదారుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘సినీ పరిశ్రమ అభివృధ్దికి పాటుపడుతున్న డైనమిక్‌ సీఏం  కేసీఆర్‌.  ఇంత డైనమిక్‌గా ఏ ముఖ్యమంత్రి ఇండస్ట్రీకి సహకరించలేదు’ అని చెప్పారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు  ఎన్‌.శంకర్‌ మాట్లాడుతూ ‘హైదరాబాద్‌ను ప్రపంచ సినిమా హబ్‌గా తయారు చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం. అందులో భాగంగా ఎలాంటి సంస్కరణలు అమలుపరచాలనే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏడెనిమిది నెలల క్రితం ముఖ్యమంత్రితో సమావేశమైనప్పుడు  హెల్త్‌, రేషన్‌ కార్డులతో పాటు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు సంబంధించిన సమస్యలన్నీ విన్నవించాం. కరోనా రాకుండా ఉండుంటే ఇవన్నీ ముఖ్యమంత్రి ఇచ్చి ఉండేవారు.  నిర్మాతలు, కార్మికులు లాభాల్ని పొందేవారు. చిన్న నిర్మాతలకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన నిర్ణయం పట్ల ఎగ్జిబిటర్లు, కార్మికులు, నిర్మాతలు అందరూ సంతోషంగా ఫీలవుతున్నారు. రాయితీలు ప్రకటించి ఇండస్ట్రీని అక్కున చేర్చుకొని హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు’ అని చెప్పారు.  ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ‘ ఏడాది కాలంగా తెలుగు సినీ పరిశ్రమ కోరినవన్నీ ముఖ్యమంత్రి కాదనకుండా ఇస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న సినీ పరిశ్రమను కాపాడుకోవటం మన బాధ్యత అని చెప్పిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్‌. అడగటమే ఆలస్యం అన్నీ ఇస్తున్నారు. చెప్పింది చేసే గొప్ప ముఖ్యమంత్రి దొరకడం, వాటిని అమలు పరచడానికి కేటీఆర్‌ లాంటి మంత్రి దొరకడం మన అందరి అదృష్టం’ అని చెప్పారు. కేసీఆర్‌ ప్రకటనలతో చిత్రసీమలో నూతనోత్సాహం వచ్చిందని భరత్‌ అన్నారు.

కరోనా సంక్షోభంతో నిరాశలో కూరుకుపోయిన తెలుగు చిత్రసీమకు సరికొత్త జవసత్వాలు అందిస్తూ పరిశ్రమను దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలపాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్‌ పలు వరాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. చిన్న సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌తో పాటు సినిమా థియేటర్లకు కనీస విద్యుత్‌ఛార్జీల రద్దు, టిక్కెట్‌ రేట్ల సవరింపు వంటి ఉపశమన చర్యలు పరిశ్రమ అభ్యున్నతికి దోహదం చేస్తూ కార్మికుల ఉపాధికి భరోసానిస్తాయని సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. చిత్రసీమ పునర్వైభవాన్ని కాంక్షిస్తూ సీఎం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో అద్భుత ఫలితాల్ని సాధించి సినీరంగానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తాయని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికల ద్వారా సీఎం కేసీఆర్‌ నిర్ణయాల పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


సీఎం కేసీఆర్‌గారు ప్రకటించిన ఉపశమన చర్యలు పరిశ్రమకు కొత్త మార్గాన్ని చూపిస్తాయి. కరోనా కష్టకాలంలో చిత్రసీమకు కొత్త ఊపిరి అందించే నిర్ణయాలివి. ఇండస్ట్రీ బాగు కోసం గొప్ప తపనతో కృషిచేస్తున్న సీఎంగారికి ధన్యవాదాలు.

- వెంకటేష్‌

తెలుగు పరిశ్రమకు ఇదొక ముందడుగు. 

సీఎం నిర్ణయాలు వేలాది మంది సినీ కార్మికులకు మేలు చేస్తాయి. థియేటర్ల ఓపెనింగ్స్‌కు అనుమతి ఇవ్వడం ద్వారా తిరిగి వెండితెరపై సినిమాల్ని ఆస్వాదించే అవకాశం దక్కుతుంది. కరోనా వంటి సంక్షుభిత పరిస్థితుల్లో సాహసోపేతమైన నిర్ణయాలతో పరిశ్రమను ఆదుకుంటున్న సీఎంగారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

- మహేష్‌బాబు

గౌరవ ముఖ్యమంత్రిగారు ప్రకటించిన నిర్ణయాలతో యావత్‌ తెలుగు పరిశ్రమలో సంతోషం వెల్లివిరుస్తోంది. సంక్షోభకాలంలో తీసుకున్న ఈ మహత్తర నిర్ణయాలు పరిశ్రమ ఉన్నతికి, పూర్వ వైభవం సొంతం చేసుకోవడానికి బాటలు వేస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా

- ఎస్‌.ఎస్‌.రాజమౌళి

నేటి అనిశ్చిత పరిస్థితుల్లో సీఎంగారు తీసుకున్న నిర్ణయాలు పరిశ్రమకు ఆక్సిజన్‌ అందిస్తాయి. సినీరంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం గొప్ప చర్యలు తీసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా.

- పూరి జగన్నాథ్‌ 

సీఎంగారు తీసుకున్న నిర్ణయాలు తెలుగు సినీరంగ ఉన్నతికి దోహదం చేస్తాయి. గత కొద్ది నెలలుగా ఉపాధిలేక ఇబ్బంది పడుతున్న కార్మికులకు భరోసా లభిస్తుంది. పరిశ్రమకు గొప్ప ఊరటనిచ్చే ఉపశమన చర్యల్ని ప్రకటించిన సీఎం కేసీఆర్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

-రవితేజ

కరోనా ప్రభావంతో తెలుగు ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. సీఎం ప్రకటించిన వరాలు తిరిగి పరిశ్రమను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఉపకరిస్తాయి. ఎందరో కార్మికుల జీవితాల్లో వెలుగుల్ని నింపే నిర్ణయాల్ని తీసుకున్న సీఎం కేసీఆర్‌గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

- ఛార్మి

కరోనాతో కుదేలైన చిత్ర పరిశ్రమను ఆదుకోవడానికి  సీఎం కేసీఆర్‌ గారు ప్రకటన ఎంతో స్ఫూర్తినిచ్చింది.  ఈ రాయితీలు తెలుగు సినీ పరిశ్రమను మళ్లీ మామూలు స్థితికి తీసుకువస్తాయనే నమ్మకం వుంది. సీఎం కేసీఆర్‌ గారికి ధన్యవాదాలు. 

-మ్రైతీ మూవీమేకర్స్‌ 

కరోనా మహమ్మారి వల్ల ఎంతో నష్టపోయిన థియేటర్లతో పాటు సినీ పరిశ్రమకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి సీఎం కేసీఆర్‌గారు చేపట్టిన విప్లవాత్మక చర్యల పట్ల కృతజ్ఞతలు చెబుతున్నా.  మీ నిబద్ధత, ఉదారత మాలో ఎల్లప్పుడూ స్ఫూర్తిని, ఉత్తేజాన్ని నింపుతోంది.

- గుణ టీమ్‌ వర్క్స్‌

ఈ కరోనా విపత్కర సమయంలో సీఎం గారు ప్రకటించిన రాయితీలు సినీ పరిశ్రమకు, థియేటర్లకు ఎంతో ఊరటనిస్తాయి. నష్టాల నుంచి గట్టెక్కడానికి ఎంతో మేలు చేస్తాయి. సీఎం గారికి మా హృదయపూర్వక కృతజతలు. 

- 14 రీల్స్‌ ప్లస్‌

సినీరంగానికి ఎంతో మేలు చేసే గొప్ప ఉపశమన చర్యల్ని ప్రకటించిన సీఎం కేసీఆర్‌గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాం. కార్మికులకు ఎంతో ఉపయుక్తమైన నిర్ణయాలివి. ఇండస్ట్రీ ప్రగతిపథంలో నడిచేందుకు దోహపడతాయి.

- వైజయంతీ 

మూవీస్‌ సంస్థపరిశ్రమ శ్రేయస్సునుకాంక్షిస్తూ సీఎం కేసీఆర్‌గారు తీసుకున్న విప్లవాత్మక చర్యలివి. కరోనా వల్ల కష్టాల్లో చిక్కుకున్న తెలుగు సినీ పరిశ్రమను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావడం ఆనందంగా ఉంది.  

- సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌

తెలంగాణ ప్రభుత్వం అందించబోతున్న రాయితీలు పరిశ్రమలోని నలభైవేల మంది కార్మికులకు ఎంతగానో మేలు చేస్తాయి. తొమ్మిదిశాతం జీఎస్టీని రీయింబర్స్‌మెంట్‌ చేస్తానని చెప్పడం అద్భుతమైన విషయంగా చెప్పొచ్చు. చిత్రసీమ పట్ల ఉదారంగా వ్యహరిస్తున్న సీఎంగారికి మా సంస్థ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. 

- గీతా ఆర్ట్స్‌ సంస్థ

పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి శ్రీకేసీఆర్‌ గారు ఏర్పాటు చేసిన చలనచిత్ర అభ్యుదయ ప్రణాళిక అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతోంది. వినోదం కోసం అందరికి ఆసరాగా నిలిచిన సినీ పరిశ్రమకు ఎవరూ ఆసరాగా నిలవలేకపోవడం ఎంతో విచారకరమైన విషయం కానీ ఇప్పుడు శ్రీ కేసీఆర్‌ గారు ఇస్తున్న ఈ అండ ఎంతోమందికి ఆసరాగా, మరెంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. బతుకుదెరువు కోసం ఏ దిక్కుతోచని 40వేల మంది సినీ కార్మికులకు రేషన్‌కార్డులను మంజూరు చేసి తానే దిక్కుగా నిలబడి, వారి కన్నీళ్లను కనుమరుగు చేయడానికి దోహదపడుతున్నారు. జీఎస్టీలో రాయితీలను కల్పించి నిర్మాతలకు సహాయం చేకూరుస్తూ మరెన్నో నిర్మాణాలకు నాందిగా నిలబడుతున్నారు. హాలు నడుపు వేళలు మరియు టికెట్‌ రేట్లుని సడలింపులు ఇచ్చి ఆరు నెలలుగా సినిమా హాల్లకు విద్యుత్‌ బిల్లులను మాఫీ చేసి సినిమా పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని నింపారు మన ముఖ్యమంత్రిగారు. కొంచెం ఆలస్యం అయినా సరే మీరు పరిశ్రమకు ఇచ్చిన ఈ దీపావళి కానుకకి మరొక్కమారు కృతజతలు తెలియజేస్తూ ..

ఇట్లు మీ నాగబాబు కొణిదెల 

కరోనా మహమ్మారి వల్ల చిత్రసీమ ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌గారు చేసిన ప్రకటనలు పరిశ్రమకు కొత్త జవసత్వాల్ని అందిస్తాయి. థియేటర్లు ఓపెన్‌కావడం వల్ల తిరిగి ఇండస్ట్రీ సాధారణ స్థితికి చేరుకునే వీలు కలుగుతుంది. చిత్రసీమ ఉన్నతికి తీసుకున్న గొప్ప నిర్ణయాలకు కృతజ్ఞతలు.

- సంపత్‌నంది (దర్శకుడు)

సినీ పరిశ్రమ పురోభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల పట్ల కృతజ్ఞతలు చెప్పడం చిన్న మాటే అవుతోంది. ప్రేక్షకులతో మళ్లీ థియేటర్లు కళకళలాడే రోజును చూడాలని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.  పూర్వపు  రోజులు మళ్లీ వస్తాయనే నమ్మకముంది.

-సుధీర్‌బాబు

కరోనాతో సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న తెలుగు చిత్ర పరిశ్రమకు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన రాయితీలు ఎంతో ఉపయోగకరమైనవి. ప్రస్తుత తరుణంలో ఈ ప్రకటన అందరిలో ఆనందాన్ని నింపింది. థియేటర్లు, చిత్రపరిశ్రమ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటాయనే నమ్మకం వుంది.     

రాధామోహన్‌, నిర్మాత