ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ ఏడాది గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చావుకబురు చల్లగా సినిమా చేశాడు ఈయన. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఇంకా చెప్పాలంటే గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి వచ్చిన తొలి డిజాస్టర్ ఇది. ఇలాంటి సమయంలో కచ్చితంగా సూపర్ హిట్ అందుకోవాల్సిన సందిగ్ధంలో పడిపోయాడు కార్తికేయ. ఇప్పుడు కానీ విజయం రాలేదు అంటే కార్తికేయ కెరీర్ మరింత డైలమాలో పడిపోతుంది. ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమా రాజా విక్రమార్క.
వినాయక్ దగ్గర శిష్యరికం చేసిన శ్రీ సిరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంతా బాగానే ఉంది.. కానీ చిరంజీవి సినిమా టైటిల్ తీసుకోవడం దగ్గరే కార్తికేయ కాస్త కంగారు పడుతున్నాడు. ఇందులో కంగారు పడాల్సిన విషయం ఏముంది అనుకుంటున్నారా.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ తీసుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడమే. ఏ మాత్రం తేడా జరిగినా సినిమా దారుణంగా నిరాశపరుస్తుంది. గతంలో చిరంజీవి సినిమా టైటిల్స్ విషయంలో చాలా సార్లు ఇదే జరిగింది. ఒక్క కార్తీ మాత్రమే ఖైదీ టైటిల్ వాడుకొని సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.
మిగిలిన వాళ్ళు ఎవరు కూడా చిరు టైటిల్స్ తో పెద్దగా విజయం అందుకోలేదు. దొంగ, గ్యాంగ్ లీడర్, యముడికి మొగుడు, బిల్లా రంగా, స్టేట్ రౌడీ ఇలా చాలా టైటిల్స్ తో సినిమాలు వచ్చాయి. కానీ అందులో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. చిరంజీవి టైటిల్స్ పెట్టుకోవడం బాగానే ఉంటుంది.. కానీ ఆ ఇమేజ్ పాడు చేయకుండా సినిమాలు చేయడం దగ్గర అసలు సమస్య బయట పడుతుంది. ఇక్కడే కార్తికేయ కూడా కంగారు పడుతున్నాడు. రాజా విక్రమార్క టైటిల్ తీసుకున్నాడు కానీ అది ఎలా ఉండబోతుందో అని టెన్షన్ పడుతున్నాడు ఈ కుర్రహీరో