సోమవారం 18 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 15:29:02

కన్నడ దండయాత్ర కూడా మొదలైంది..!

 కన్నడ దండయాత్ర కూడా మొదలైంది..!

తెలుగు ఇండస్ట్రీలో గుళ్లో గంటలా మారిపోయింది. ఎవరు కావలిస్తే వాళ్లు వచ్చేసి గంటలు కొడుతున్నారు. అదేంటబ్బా అనుకుంటున్నారా..? ఇన్నాళ్ళూ బాలీవుడ్ తర్వాత అనేవాళ్లం కానీ ఇప్పుడు బాలీవుడ్ కంటే కూడా మన ఇండస్ట్రీకే ఎక్కువ మార్కెట్ ఉందనిపిస్తుంది. కంగన రనౌత్ లాంటి వాళ్లు దీనిపై ఓపెన్ స్టేట్మెంట్స్ కూడా పాస్ చేసారు. తెలుగు ఇండస్ట్రీ గురించి వాళ్లు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రతీ హీరో కూడా తెలుగులో మార్కెట్ సంపాదించుకోడానికి చాలా తంటాలు పడుతున్నారు.. తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే చాలా ఏళ్ళ కిందే తమిళ హీరోలు తెలుగుపై దండయాత్ర చేసారు. అక్కడ్నుంచి రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్ మొదలై ఇప్పటి కార్తి, విజయ్ వరకు అంతా ఇక్కడ మార్కెట్ సంపాదించుకున్నారు. 

తెలుగులో మార్కెట్ వచ్చిందంటే చాలు కచ్చితంగా సినిమాలకు మంచి వసూళ్లు వస్తుంటాయి. అయితే ఇప్పటి వరకు కేవలం తమిళ హీరోలకు మాత్రమే తెలుగులో మార్కెట్ ఉంది. కానీ ఇప్పుడు కన్నడ హీరోలు కూడా దండయాత్ర మొదలు పెట్టారు. అసలు కన్నడ సినిమాలకు ఇక్కడ గిరాకీ ఉండదు.. కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావనే వాదన ఉండేది. ఒకప్పుడు ఉపేంద్ర సినిమాలు మాత్రమే తెలుగులో సంచలన విజయం సాధించాయి. ఆయన నటించిన ఏ, రా, ఉపేంద్ర లాంటి సినిమాలు తెలుగులోనూ అదరగొట్టాయి. మళ్లీ ఆ తర్వాత ఏ కన్నడ హీరో కూడా తెలుగులో మార్కెట్ సృష్టించుకోలేకపోయాడు. కనీసం అటు వైపు ఆలోచించలేదు కూడా. కానీ కేజీఎఫ్ విజయం తర్వాత తెలుగుపై మరోసారి కన్నేసారు కన్నడ హీరోలు. 

ఇప్పటికే యశ్ సినిమాలు కొన్ని తెలుగులో డబ్ చేయడానికి చూస్తున్నారు. ఆయనతో పాటు సుదీప్ కు కూడా తెలుగులో మంచి ఇమేజ్ ఉంది కానీ మార్కెట్ లేదు. గతేడాది పహిల్వాన్ సినిమాతో వచ్చాడు కూడా. ఇప్పుడు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా తెలుగుపై కన్నేసాడు. ఈయన నటిస్తున్న యువరత్న సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా ప్రోమో కూడా విడుదలైంది. పవర్ ఆఫ్ యూత్ పేరుతో ఈ సినిమా వస్తుంది. తమన్ సంగీతం అందించాడు. పునీత్ రాజ్ కుమార్ తెలుగులో మార్కెట్ సంపాదించుకోవాలని చాలా ఏళ్ళ క్రితమే అనుకున్నాడు కానీ కుదర్లేదు. దాంతో ఆశలు వదిలేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అదే ప్రయత్నం తిరిగి మొదలు పెట్టాడు. మళ్లీ ఇప్పుడెలా ఉంటుందో పరిస్థితి. ఏదేమైనా కన్నడ హీరోలు కూడా ఇప్పుడు దండయాత్రకు సిద్ధం అవుతున్నారన్నమాట.