గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 00:21:41

అసెంబ్లీలో విప్లవనాయిక

అసెంబ్లీలో విప్లవనాయిక

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘తలైవి’. కంగనారనౌత్‌ టైటిల్‌ రోల్‌ని పోషిస్తోంది. జయలలిత సినీ, రాజకీయ ప్రయాణంలోని ముఖ్యఘట్టాల్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఏ.ఎల్‌.విజయ్‌ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జయలలిత తొలినాటి రాజకీయ జీవితానికి సంబంధించిన ముఖ్యఘట్టాల్ని తాజా షెడ్యూల్‌లో తెరకెక్కిస్తున్నారు. అసెంబ్లీ నేపథ్యంలో జయలలితకు సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా షూటింగ్‌ తాలూకు విశేషాల్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది కంగనారనౌత్‌. జయలలిత గెటప్‌లో ఉన్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోల్ని షేర్‌ చేస్తూ ‘విప్లవ నాయకి జయలలిత ఆశీర్వాదంతో సినిమా మరో షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్నాం. కరోనా వల్ల సినీ నిర్మాణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ సెట్‌లో యాక్షన్‌, కట్‌ ఆదేశాల మధ్యలో సాగే నటన...అంకితభావం విషయంలో ఎలాంటి మార్పులు రాలేదు’ అని కంగనరనౌత్‌ వ్యాఖ్యానించింది. ఆమె పోస్ట్‌ చేసిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోల్లో కంగనారనౌత్‌ అచ్చం జయలలిత మాదిరిగానే కనిపిస్తోందని, విప్లవ నాయిక పాత్రకు బాగా కుదిరిందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ నిర్మిస్తున్నారు. అరవిందస్వామి, ప్రకాష్‌రాజ్‌, భాగ్యశ్రీ ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. logo