శనివారం 06 జూన్ 2020
Cinema - May 13, 2020 , 08:44:44

ప్ర‌ధానితో ఏకీభ‌విస్తాం: క‌మ‌ల్ హాస‌న్

ప్ర‌ధానితో ఏకీభ‌విస్తాం: క‌మ‌ల్ హాస‌న్

మంగ‌ళ‌వారం రాత్రి భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. ఇందులో కరోనా వ‌ల‌న దెబ్బ‌తిన్న‌ భారత ఆర్థికవ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు  రూ.20 లక్షల కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. కార్పొరేట్‌రంగం నుంచి రైతన్నల వరకు, చిన్న పరిశ్రమల నుంచి వలస కూలీవరకు ప్రతి ఒక్కరూ తిరిగి పుంజుకొనేందుకు అవసరమైన శక్తిని ఈ ప్యాకేజీ ఇస్తుందని తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న వివిధ వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌' పేరిట భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు

ప్ర‌ధాని భారీ ఉద్దీపన ప్యాకేజిపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమలహాసన్ స్పందించారు. ప్రధాని పేర్కొన్న రెండు అంశాలతో తాము కూడా ఏకీభవిస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ  సంక్షోభంలో పేదవాడే అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్వావలంబనతోనే భవిష్యత్ ముడిపడి ఉంటుందని ప్రధాని పేర్కొన్నారని, వాటిని తాము కూడా అంగీకరిస్తున్నామని కమల్ ట్వీట్ చేశారు. ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజిని కూడా స్వాగతిస్తున్నామని, అయితే, కేంద్రం ఈ విషయంలో పూర్తి వివ‌రాలు అందిస్తుంద‌ని చెప్పుకొచ్చింది. అన్నీ బాగానే ఉన్నా అంతిమంగా దేశంలోని నిరుపేదలు ఏ మేరకు లబ్దిపొందుతారో చూడాలి అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు క‌మ‌ల్. ఆ మ‌ధ్య క‌మ‌ల్‌..ప్ర‌ధాని చేప‌ట్టిన దీపాలు వెలిగించే కార్య‌క్ర‌మంతో పాటు వ‌ల‌స కూలీల విష‌యంలో అనాలోచిత వైఖ‌రిని ఖండించిన సంగ‌తి తెలిసిందే.


logo