మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 10, 2020 , 00:11:14

తెలంగాణ చైతన్యస్ఫూర్తి ప్రజాకవి కాళోజీ

తెలంగాణ చైతన్యస్ఫూర్తి ప్రజాకవి కాళోజీ

‘ప్రజాకవి కాళోజీ’ జీవితకథా చిత్రం తీయడం సాహసంతో కూడుకున్న ప్రక్రియ. ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టిన ప్రభాకర్‌ జైనీ అభినందనీయుడు’ అని అన్నారు ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌. విజయలక్ష్మీ జైనీ నిర్మాణ సారథ్యంలో జైనీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్‌ చిత్రానికి సంబంధించి బుధవారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కాళోజీగారి 106వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ వీడియోసాంగ్‌ను నా చేతుల మీదుగా విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నా. కాళోజీ తెలంగాణ చైతన్యస్ఫూర్తి. కళలకు కాణాచి అయిన వరంగల్‌ నుంచి జయకేతనం ఎగరేసిన మహాకవి. తెలుగువారిలో సాహిత్యరంగం నుంచి పద్మవిభూషణ్‌ పొందిన ఏకైక వ్యక్తి కాళోజీ. అందుకే మనం కాళోజీని ప్రతి ఏడాది ఘనంగా స్మరించుకుంటున్నాం. ఆయన జన్మదినోత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.  ఈ సినిమా పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉంది. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సభ్యుల్ని కేటీఆర్‌ అభినందించారు. ఈ సినిమాలో కాళోజీ పాత్రలో మూలవిరాట్‌ నటించగా,  పీవీ నరసింహారావు గారి పాత్రలో ఆయన సోదరుడు పీవీ మనోహరరావు నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవికుమార్‌ నీర్ల, పాటలు: బిక్కి కృష్ణ, సంగీతం: ఆత్రేయ.


logo