పద్నాలుగేళ్ల సినీ ప్రయాణంలో ప్రేమ, కుటుంబ కథాచిత్రాల్లోనే ఎక్కువగా నటించింది పంజాబీ సుందరి కాజల్ అగర్వాల్. కెరీర్లో తొలిసారి ఆమె ఓ హారర్ సినిమా చేయబోతున్నది. డీకే దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, రెజీనా, జననీ అయ్యర్, రైజా విల్సన్ ప్రధాన పాత్రల్లో ‘కరుంగాపియమ్’ (నల్లటి కావ్యం అని అర్థం) పేరుతో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతోంది. హారర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో 1940 కాలం నాటి జమీందారిణి పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించబోతున్నట్లు దర్శకుడు తెలిపారు. ‘గ్లామర్ హంగులకు దూరంగా సంప్రదాయబద్దంగా కాజల్ పాత్ర సాగుతుంది. ఈ పాత్ర కోసం స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న జమీందారి కుటుంబాల జీవన విధానాన్ని, ఆహార్యాన్ని గురించి కాజల్ పరిశోధన చేసి నటించింది. ఆమె లుక్ కొత్తగా ఉంటుంది’ అని దర్శకుడు తెలిపారు. కాజల్ క్యారెక్టర్ 1940 బ్యాక్డ్రాప్లో సాగగా, రెజీనా, జననీ అయ్యర్, రైజా విల్సన్ పాత్రలు 2021 నేపథ్యంలో ఉంటాయని సమాచారం. రెండు కాలాల మధ్య ఉన్న సంబంధమేమిటన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.