గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 23:35:23

చందమామకు పెళ్లికళ

చందమామకు పెళ్లికళ

అగ్ర కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ను అభిమానులు వెండితెర చందమామగా అభివర్ణిస్తుంటారు. గత దశాబ్దన్నరగా ఈ అందాల జాబిలి తెలుగు తెరపై కాంతులీనుతూనే ఉంది. యువతరంలో చక్కటి అభిమానగణాన్ని సంపాదించుకున్న ఈ పంజాబీ సోయగం మససిచ్చిన జతగాడితో పెళ్లిపీటలెక్కడానికి సిద్ధమవుతోంది. ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తతో కాజల్‌ నిశ్చితార్థం జరిగిందని కొన్ని నెలల క్రితమే వార్తలొచ్చాయి. తాజాగా ఈ అమ్మడి హృదయాన్ని దోచుకున్న ప్రియసఖుడెవరో తెలిసింది. ముంబయిలో గుర్తింపుపొందిన వ్యాపారవేత్త, ఇంటీరియర్‌ డిజైనర్‌, ఫ్యాషన్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ను గడిపిస్తున్న గౌతమ్‌ కిచ్లును కాజల్‌ అగర్వాల్‌ మనువాడబోతున్నట్లు తెలిసింది. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన ప్రేమవివాహమని చెబుతున్నారు. 

గౌతమ్‌కిచ్లుతో కాజల్‌ అగర్వాల్‌కు కొన్నేళ్ల నుంచి పరిచయం ఉందని, పెద్దల అంగీకారంతో ఈ జంట వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారని అంటున్నారు. ముంబయిలోని ప్రఖ్యాత ఏడునక్షత్రాల హోటల్‌లో ఈ జంట వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. వస్త్ర వ్యాపారంలో ఉన్న కాజల్‌ అగర్వాల్‌ అమ్మనాన్న సుమన్‌ అగర్వాల్‌, వినయ్‌ అగర్వాల్‌ ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి వార్త బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే తన పెళ్లి గురించి కాజల్‌ అగర్వాల్‌ ఇప్పటివరకు పెదవి విప్పలేదు. తన తల్లిదండ్రులే వివాహం గురించి మీడియాకు వెల్లడిస్తారనే ఆలోచనలో కాజల్‌ అగర్వాల్‌ ఉందని ఆమె సన్నిహితులు అంటున్నారు.logo