ఆదివారం 17 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 21:19:48

పెళ్ళి తర్వాత అలాంటి పాత్రలో నటించబోతున్న కాజల్ అగర్వాల్

పెళ్ళి తర్వాత అలాంటి పాత్రలో నటించబోతున్న కాజల్ అగర్వాల్

హైద‌రాబాద్ : ఈ మధ్యే పెళ్లి చేసుకుంది కాజల్ అగర్వాల్. తన మనసుకు నచ్చిన గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు నడిచింది. హాయిగా హనీమూన్ కూడా పూర్తి చేసుకుని వచ్చి మళ్లీ సినిమాలతో బిజీ కానుంది. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తానంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది చందమామ. అన్నట్లుగానే ఈమెకు అవకాశాలు కూడా వస్తున్నాయి. 14 ఏళ్ళ నుంచి అన్ని ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. 

అయితే పెళ్ళి తర్వాత గ్లామర్ పాత్రలు కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలపై ఫోకస్ చేయబోతుంది కాజల్. ప్రస్తుతం ఈమె తెలుగులో చిరంజీవి ఆచార్యతో పాటు మంచు విష్ణు మోసగాళ్లు సినిమాలో నటిస్తుంది. తమిళనాట భారతీయుడు 2లో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చింది కాజల్. అయితే ఇప్పటి వరకు కెరీర్‌లో ఎప్పుడూ టచ్ చేయని హార్రర్ పాత్రలో కాజల్ కనిపించబోతుందని తెలుస్తుంది. డీకే దర్శకత్వంలో ఈ సినిమా రానుందని ప్రచారం జరుగుతుంది. 

ఇప్పటికే కథ విన్న చందమామ ఓకే చెప్పేసింది కూడా. ఇందులో కాజల్ కిచ్లుతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటించబోతున్నారు. నలుగురు అమ్మాయిల మధ్య నడిచే కథగా ఈ సినిమా ఉండబోతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. ఇప్పటి వరకు హార్రర్ జోనర్ కు వెళ్లలేదు కాజల్. మధ్యలో కొన్ని ఆఫర్స్ వచ్చినా కూడా నో చెప్పింది ఈ ముద్దుగుమ్మ. లవ్, రొమాన్స్, ఫ్యామిలీ అంటూ ఇటు వైపే తిరిగిన కాజల్.. తొలిసారి భయపెట్టడానికి వస్తుంది. మొత్తానికి కుమారిగా ఉన్నపుడు కూల్ సినిమాలు చేసి.. శ్రీమతిగా మారగానే హార్రర్ అంటుంది కాజల్ అగర్వాల్.