ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్‌లాల్ దర్శకుడిగా మారి తెలుగులో ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఇషా చావ్లా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘దివ్య దృష్టి’ అనే పేరును ఖరారు చేశారు. కమల్ కామరాజు, నిళగళ్ రవి, తులసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లవ్లీ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. దర్శకుడు కబీర్‌లాల్ మాట్లాడుతూ…‘తన సోదరి హత్యకు కారణమైన వారిని వెతికిపట్టుకునేందుకు ఓ దివ్యాంగురాలు చేసిన పోరాటమే ఈ సినిమా. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే థ్రిల్లర్ తరహాలో సాగుతుంది. చూపులేకున్నా హంతకులను ఆమె ఎలా పట్టుకుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రం ద్వారా తెలుగులో దర్శకుడిగా అడుగుపెట్టడం సంతోషంగా ఉంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : షాహిద్ లాల్, నేపథ్య సంగీతం : అచ్చు రాజమణి.