ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). కాల్పనిక చారిత్రక అంశాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘దోస్తీ’ పేరుతో ప్రత్యేకమైన పాటను విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్నందించిన ఈ గీతాన్ని హేమచంద్ర ఆలపించారు. స్నేహం గురించి తెలియజెపుతూనే.. విరుద్ధ భావాల సంఘర్షణను భావయుక్తంగా ఈ పాటలో ఆవిష్కరించారు. ‘పులికి..విలుకాడికి..దోస్తీ, తలకి..ఉరితాడుకి..దోస్తీ, కదిలే కార్చిర్చుకి..కసిరే వడగళ్లకి…దోస్తీ, రవికీ..మేఘానికి..దోస్తీ, బడబాగ్నికి..జడివానకి..దోస్తీ..’ అంటూ పాట అర్థవంతంగా సాగింది. దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో అలియాభట్, ఒలీవియా మోరీస్ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్‌దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.