గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 09, 2020 , 09:57:54

అప‌రిచిత వ్యక్తుల‌తో ఆన్‌లైన్ ప‌రిచ‌యాలు వ‌ద్దు: ఎన్టీఆర్

అప‌రిచిత వ్యక్తుల‌తో ఆన్‌లైన్ ప‌రిచ‌యాలు వ‌ద్దు: ఎన్టీఆర్

డిజిట‌ల్ యుగంలో సైబ‌ర్ నేర‌గాళ్ళ ఆకృత్యాలు అంత‌కంత పెరుగుతూ పోతున్నాయి. ఆన్‌లైన్ మోసాల‌తో వీరు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో ప‌డి మోస‌పోతున్నారు. అమ్మాయిల ద‌గ్గ‌ర నుండి వ్య‌క్తిగ‌త స‌మాచారం సేక‌రించి వారిని బెదిరించ‌డం, డ‌బ్బులు డిమాండ్ చేయ‌డం వంటివి చేస్తున్నారు. దీంతో అమ్మాయిలు ఎంతో మాన‌సిక వేద‌న‌కు లోను కావ‌డ‌మే కాక కొన్ని సంద‌ర్భాల‌లో ఆత్మ‌హ‌త్య కూడా చేసుకుంటున్నారు

స‌మాజంలో జ‌రుగున్న అకృత్యాల‌కు సంబంధించి ప్ర‌జ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేస్తున్న హైదరాబాద్‌ నగర పోలీసులు తాజాగా సైబ‌ర్ మోసాల‌కు సంబంధించి ఎన్టీఆర్‌తో ఓ వీడియోని రూపొందించి విడుదల చేశారు. ఇందులో సోషల్ మీడియా ద్వారా ప‌రిచ‌య‌మైన వ్య‌క్తి ద్వారా మ‌హిళ ఎంత మాన‌సిక క్షోభ అనుభ‌విస్తుందో క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. చివ‌రలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఇలాంటి మోసాల‌లో చిక్కుకోకుండా ఉండేందుకు యువ‌త త‌గినన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.   

''వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయండి. జాగ్రత్త!'' అంటూ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. యువ‌త‌కు ఆయ‌న ఇచ్చిన సందేశం నెటిజన్ల చేత భేష్ అనిపించుకుంటోంది. 


logo