గురువారం 09 జూలై 2020
Cinema - Mar 31, 2020 , 22:18:02

ఇంటి విలువ తెలిసింది

ఇంటి విలువ తెలిసింది

మనిషికి భ్రమణకాంక్ష ఎక్కువ. నిత్య సంచారిగా లోకాన్ని చుట్టిరావాలని తాపత్రయపడుతుంటాడు. సమూహం నుంచి విడిపడి ఇంటికి మాత్రమే పరిమితమైపోవాల్సిన పరిస్థితుల్ని ఎవరూ స్వాగతించరు. అయితే కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రజలందరూ బాధ్యతగా లాక్‌డౌన్‌ పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వ ప్రకటిత స్వీయ నిర్బంధంలో మన తారలు ఎన్నో జీవిత సత్యాల్ని తెలుసుకుంటున్నారట. ఈ వారం రోజుల్లో తన జీవితంలో ఎన్నో సానుకూల మార్పులొచ్చాయని చెబుతోంది యువ నాయకి జాన్వీకపూర్‌. ఆమె మాట్లాడుతూ ‘ఆహార పదార్థాల పొదుపు గురించి, మన సన్నిహితుల ఆరోగ్యం గురించి గతంలో ఎక్కువగా ఆలోచించేదాన్ని కాదు. కానీ ఇప్పుడు అవసరమైనంత మేరకు మాత్రమే ఆహారాన్ని తయారుచేసుకోవాలని తెలుసుకున్నా. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల కోసం మన సన్నిహితులు తరచుగా బయటకు వెళ్లడం వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. అందుకే వారిని ఎక్కువగా బయటకు వెళ్లకుండా కట్టడి చేశాను. నిత్యావసర వస్తువుల్ని మితంగా వాడుతున్నా. గతంలో నేను, చెల్లెలు ఖుషి మా పనులు ముగించుకొని ఇంటికి ఎప్పుడొస్తామా అని నాన్న ఎదురుచూసేవారు. ఇప్పుడు ఆయనకు  నిరీక్షించే బాధ తప్పింది. ఉదయం లేవగానే నాన్న సోఫాలో కూర్చుని మమ్మల్ని చూసి చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. మేము రోజంతా ఆయన ముందే ఉంటామనే సంతృప్తి ఆయన కళ్లలో కనిపిస్తోంది. జీవితంలో నిజమైన ఆనందాలు, ఇంటి విలువ ఏమిటో ఈ వారంరోజుల్లోనే తెలిసింది’ అని చెప్పింది జాన్వీకపూర్‌.logo