శనివారం 29 ఫిబ్రవరి 2020
రివ్యూ: జాను

రివ్యూ: జాను

Feb 07, 2020 , 16:43:08
PRINT
రివ్యూ: జాను

ప్రేమ భావనలు నిత్యనూతనం. అందుకే వెండితెరపై ప్రేమకథలకు పునరావృతం దోషం ఉండదు. ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి. ముఖ్యంగా నాస్టాల్జిక్‌ ఫీల్‌తో సాగే ప్రణయగాథలతో ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని తరచి చూసుకుంటారు

తారాగణం: శర్వానంద్‌, సమంత, వెన్నెల కిషోర్‌, శరణ్య, తాగుబోతు రమేష్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: మహేంద్రన్‌ జయరాజ్‌

సంగీతం: గోవింద్‌ వసంత

నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌

నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్‌

దర్శకత్వం: సి.ప్రేమ్‌కుమార్‌


ప్రేమ భావనలు నిత్యనూతనం. అందుకే వెండితెరపై ప్రేమకథలకు పునరావృతం దోషం ఉండదు. ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి. ముఖ్యంగా నాస్టాల్జిక్‌ ఫీల్‌తో సాగే ప్రణయగాథలతో ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని తరచి చూసుకుంటారు. గత ఏడాది తమిళంలో వచ్చిన ‘96’ అదే కోవలోనిదే.  విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం హృద్యమైన భావోద్వేగాలను రూపుకడుతూ అందరిని మెప్పించింది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆ సినిమా తెలుగు రీమేక్‌ హక్కుల్ని సొంతం చేసుకొని ‘జాను’ చిత్రాన్ని తెరకెక్కించారు. మాతృకకు దర్శకత్వం వహించిన సి.ప్రేమ్‌కుమార్‌ తెలుగు వెర్షన్‌ దర్శకత్వ బాధ్యతల్ని తీసుకున్నారు. నిర్మాతగా తన కెరీర్‌లో ఇదే తొలి రీమేక్‌ చిత్రమని, కథలోని ఎమోషన్స్‌..అందమైన జ్ఞాపకాల తాలూకు ఆర్థ్రత నచ్చి తెలుగులో పునర్నిర్మించడానికి సంకల్పించాలని దిల్‌రాజు ప్రచార కార్యక్రమాల్లో పదే పదే చెప్పడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తిని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో విడుదలైన ‘జాను’  చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..


కథా సంగ్రహణం..

రామచంద్ర (శర్వానంద్‌) ట్రావెల్‌ ఫొటోగ్రాఫర్‌. తన శిష్యబృందంతో  కలిసి వివిధ ప్రదేశాల్ని సందర్శిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అనుకోకుండా అతను తన సొంత ఊరు విశాఖపట్నంకు  వస్తాడు. అక్కడ తాను చదివిన స్కూలుకి వెళ్లి పదోతరగతి నాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటాడు. నాటి మిత్రుల్ని ఫోన్‌ ద్వారా సంప్రదిస్తాడు. అందరూ ఓ వాట్సప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకొని హైదరాబాద్‌లో రీయూనియన్‌ వేడుకకు ప్లాన్‌ చేస్తారు.  అక్కడ పదోతరగతితో తాను ఇష్టపడిన జానకిదేవి అలియాస్‌ జాను (సమంత)ను కలుసుకుంటాడు రామచంద్ర. పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలుసుకున్న రామచంద్ర-జాను తమ ప్రేమజ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటారు. ఇద్దరూ ఒకరినొకరం కోల్పోయామని బాధపడుతుంటారు. ఈ క్రమంలో రామచంద్ర నుంచి జాను ఏం కోరుకుంది? చివరకు ఈ వీరిద్దరి ప్రయాణం ఎలా ముగిసింది? అన్నదే చిత్ర కథ..


కథా విశ్లేషణ..

‘జాను’ నాస్టాల్జిక్‌ లవ్‌స్టోరీ. ప్రేమ ప్రయాణంలోని అందమైన భావనలకు, జ్ఞాపకాలకు ఓ దృశ్యరూపం. గతించిన స్పృతుల్ని పునశ్చరణ చేసుకుంటూ స్వాంతన చెందే ప్రేమికుల హృదయాంతరంగం. తొలిప్రేమ జ్ఞాపకాలు జీవితాంతం హృదయంలో పదిలంగా ఉంటాయి. ఆ జ్ఞాపకాలకు అద్దం పడుతూ ‘జాను’కథ సాగుతుంది. ప్రథమార్థంలో రామచంద్ర, జాను తాలూకు స్కూల్‌ ఎపిసోడ్‌ నాటి అనుభవాలను తిరిగి మననం చేసుకుంటున్నట్లుగా చక్కటి ఫీల్‌తో సాగింది. అందులో తొలి యవ్వనం తాలూకు భావోద్వేగాల్ని అందంగా ఆవిష్కరించారు. స్కూల్‌రోజుల్లో ప్రేమానుభవాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఎపిసోడ్‌ సూటిగా కనెక్ట్‌ అవుతుంది. ద్వితీయార్థంలో రామచంద్ర, జాను మధ్య సంఘర్షణను ఆవిష్కరించడంపైనే దృష్టిపెట్టారు. ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థం నెమ్మదిగా సాగిన భావన కలుగుతుంది.


తమిళ ‘96’ కథాంశంలో  ఎలాంటి మార్పులు చేయకుండా తెలుగు వెర్షన్‌ను రూపొందించారు. అయితే తెలుగు ఇతివృత్తాన్ని 2004 నేపథ్యంలో చూపించారు. ఎలాంటి నాటకీయత లేకుండా సన్నివేశాలన్నింటిని సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఒక్కరాత్రిలో రామచంద్ర, జాను చేసే ప్రయాణం..ఇద్దరి మధ్య అవ్యక్తమయ్యే భావాలు..ఈ క్రమంలో చెలరేగిన సంఘర్షణను అర్థవంతంగా ప్రజెంట్‌ చేశారు. అయితే కొన్ని సన్నివేశా సుదీర్ఘంగా సాగిన భావన కలుగుతుంది. సరళమైన సంభాషణల్లోనే భావుకతతో కూడిన ప్రేమను వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ైక్లెమాక్స్‌ హార్ట్‌టచింగ్‌గా సాగింది. ఎలాంటి డ్రామాకు స్కోప్‌ లేకుండా సినిమా ఆసాంతం ఓ పొయొటిక్‌ జర్నీలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యారు. అయితే తమిళ వెర్షన్‌ను చూసిన వారికి ‘జాను’లో  ఏదో ఎమోషన్‌ మిస్‌ అయిందనే భావన కలుగుతుంది.


నటీనటుల పనితీరు..

శర్వానంద్‌, సమంత తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. ఇద్దరికి ప్రేమకథాంశాలు కొత్తేమి కాదు కాబట్టి తమ పాత్రలకు పరిపూర్ణంగా న్యాయం చేశారు. పతాకఘట్టాల్లో సమంత అభినయం హృదయాల్ని స్పృశించేలా అనిపిస్తుంది. రామచంద్ర, జాను చిన్ననాటి మిత్రులుగా మురళి (వెన్నెల కిషోర్‌), శరణ్య, తాగుబోతు రమేష్‌ మంచి నటను కనబరిచారు. వెన్నెల కిషోర్‌ పంచ్‌లు నవ్వుల్ని పంచాయి. స్కూల్‌ ఎపిసోడ్‌లో సమంత పాత్రలో నటించిన గౌరి నటన చాలా బాగుంది. కళ్లతోనే చక్కటి హావభావాల్ని ప్రదర్శించింది. మిగతా నటులందరూ తమ పరిధుల మేరకు న్యాయం చేశారు.


సినిమా నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. తమ సంస్థ బ్రాండ్‌కు తగినట్లుగా నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడకుండా దిల్‌రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహేంద్రన్‌ జయరాజ్‌ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను బ్యూటీఫుల్‌గా బంధించింది. సంగీత దర్శకుడు గోవింద వసంత..తమిళ ‘96’ బాణీలను రిపీట్‌ చేశారు. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మెప్పిస్తుంది. అయితే దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్‌ తమిళ వెర్షన్‌లో మ్యాజిక్‌ను పునరావృతం చేయడంంలో అంతగా సక్సెస్‌ కాలేదనిపిస్తుంది. స్లో నరేషన్‌లో సినిమా సాగడం మైనస్‌లా అనిపిస్తుంది.


తీర్పు

ప్రేమలోని జ్ఞాపకాల్ని తరచి చూపించే ఓ అందమైన కథగా ‘జాను’ని అభివర్ణించవొచ్చు. హార్ట్‌టచింగ్‌ లవ్‌స్టోరీస్‌ను ఇష్టపడేవారిని ఈ సినిమా మెప్పిస్తుంది. 

రేటింగ్‌: 3/5


logo