శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 19:34:08

‘షకీలా’ బయోపిక్ లో ఆ చీకటి కోణాలు ఉంటాయా..?

‘షకీలా’ బయోపిక్ లో ఆ చీకటి కోణాలు ఉంటాయా..?

షకీలా..పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడు కాదు కానీ 90ల్లో అయితే ఈ పేరు వింటే చాలు బాక్సాఫీస్ షేక్ అయిపోయేది.. కుర్రాళ్ల మతులు చెడిపోయేవి. తెరపై ఎంత మ్యాజిక్ చేసిందో.. నిజ జీవితంలో అన్ని కష్టాలు అనుభవించింది షకీలా. సాఫ్ట్ పోర్న్ సినిమాలతో భీభత్సం చేసిన ఈమెకు ఒకప్పుడు భయంకరమైన ఫాలోయింగ్ ఉండేది. షకీలా సినిమా వస్తుందంటే చాలు మలయాళంలో స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా వేసుకున్న రోజులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో..? ఒకప్పుడు షకీలాకు ఉన్న పాపులారిటీ చూసి వామ్మో అని కళ్లు తేలేసే వాళ్లు నిర్మాతలు. 20 ఏళ్ల కిందే రోజుకు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంది ఈమె. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాతికేళ్ళ వయసులోనే సౌత్ సినిమా ఇండస్ట్రీని చెడుగుడు ఆడేసుకుంది షకీలా. 

అందుకే ఈ పేరు ఓ బ్రాండ్. ఇప్పుడు ఈమె బయోపిక్ వస్తుంది. షకీలా బయోపిక్ వస్తుందంటే చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే తమ భాగోతాలు ఎక్కడ బయటికి వస్తాయో అని..? ఇప్పటికే ఈమె రాసిన పుస్తకంలో కొందరు హీరోల గురించి రాసుకొచ్చింది. తనతో కొందరు అసభ్యంగా ప్రవర్తించారని.. అలాగే మలయాళంలో తనపై కుట్రలు చేసారని.. చంపడానికి కూడా చూసారంటూ తన జీవితకథలో సంచలన విషయాలు వెల్లడించింది షకీలా. ఇప్పుడు ఈమె పేరుతోనే బయోపిక్ వస్తుంది. డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. రిచా చద్దా ఇందులో షకీలా పాత్రలో నటించింది. నిజానికి 2019లోనే సినిమా విడుదల కావాల్సి ఉన్నా అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కాబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. 

ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, రాజీవ్ పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అంతేకాదు ఈ బయోపిక్ లో చాలా మంది హీరోల చీకటి భాగోతాలు కూడా స్క్రీన్ పై చూపించబోతున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో షకీలాతో కొందరు హీరోలు సన్నిహితంగా ఉన్నారనే టాక్ కూడా ఉంది. పదేళ్ల కింద సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్ లో కూడా ఇలాంటి చీకటి కోణాలు చూపించారు. ఓ సూపర్ స్టార్ సిల్క్ తో చేసిన రొమాన్స్ సినిమాలో చూపించారు. ఇప్పుడు షకీలా బయోపిక్ లో కూడా అలాంటి డర్టీ సైడ్ చూపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ బయోపిక్ కోసం ఓ వర్గం ప్రేక్షకులు అయితే కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. మరి చూడాలిక.. షకీలా బయోపిక్ ఏం మాయ చేస్తుందో..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.