శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 21:00:23

యాంకర్ ప్రదీప్ తొలి సినిమా ఇక‌ ఓటిటిలోనేనా..?

యాంకర్ ప్రదీప్ తొలి సినిమా ఇక‌ ఓటిటిలోనేనా..?

యాంకర్ ప్రదీప్‌కు బుల్లితెరపై ఎంత పాపులారిటీ ఉందనేది ఆయన చేసే కార్యక్రమాలను బట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు ప్ర‌దీప్ సిల్వర్ స్క్రీన్‌పై కూడా సత్తా చూపించాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరో కూడా అయిపోయాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తైపోయింది.. విడుదలకు సిద్ధంగానే ఉంది. అప్పుడెప్పుడో ప్యాండమిక్‌కు ముందు మార్చ్ 25న ఉగాది కానుకగా సినిమాను విడుదల చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. ప్రమోషన్స్ కూడా భారీగానే చేసారు. అన్నింటికి మించి ఈ సినిమాలోని పాట నీలి నీలి ఆకాశం దుమ్ము దులిపేసింది. ఒకే పాటతో సినిమాపై ఆసక్తి కూడా పెరిగిపోయింది. కానీ దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లు పాట సూపర్ హిట్ అయినా కరోనాతో సినిమా విడుదల కాలేదు. దాంతో అప్పట్నుంచి ఇప్పటి వరకు చడీచప్పుడు లేదు ఈ చిత్రం గురించి. 

మరోవైపు ప్రదీప్ కూడా ఈ సినిమా గురించి ఆలోచించడం మానేసి.. వచ్చినపుడే వస్తుందిలే అని తన పని తాను చేసుకుంటున్నాడు. దాంతో దాదాపు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా గురించి ప్రేక్షకులు కూడా మరిచిపోయారు. అయితే ఇప్పుడు దీన్ని గుర్తు చేసే పనిలో పడుతున్నారు దర్శక నిర్మాతలు. అదెలా..థియేటర్స్ ఇప్పట్లో లేవుగా అనుకుంటున్నారా..? అందుకే రిస్క్ ఎందుకుని ఆన్ లైన్ విడుదలకు సై అనేస్తున్నారు మేకర్స్. అన్నీ కుదిర్తే అతి త్వరలోనే ప్రదీప్ సినిమాను ఓటిటిలో చూసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఈ విషయంపై దర్శక నిర్మాతలతో ఓటిటి సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ప్రదీప్‌కు బుల్లితెరపై ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని మంచి ఆఫర్ ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఈ రేసులో ముందున్నట్లు తెలుస్తుంది. మరి ఎవరికి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా హక్కులు వెళ్తాయనేది మాత్రం కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. అయితే ఈ ఓటిటి విడుదలపై ప్రదీప్ మాత్రం కాస్త అసంతృప్తితో ఉన్నాడని వార్తలొస్తున్నాయి. హీరోగా నటించిన తొలి సినిమా ఇలా ఆన్ లైన్‌లో విడుదల కావడం ఆయనకు నచ్చడం లేదని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈ సినిమాలో ప్రదీప్‌కు జోడీగా అమృత అయ్యర్ నటించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాను సుకుమార్ శిష్యుడు మున్నా తెరకెక్కించాడు

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.