గురువారం 28 మే 2020
Cinema - Apr 29, 2020 , 13:35:21

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వ‌ర‌కు ఇర్ఫాన్ సినీ ప్ర‌స్థానం

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వ‌ర‌కు ఇర్ఫాన్ సినీ ప్ర‌స్థానం

కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఇర్ఫాన్ ఖాన్ బుధ‌వారం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మృతి అభిమానుల‌కి తీర‌ని శోకాన్ని మిగిల్చింది. ఒక్క హిందీలోనే కాక అనేక భాష‌ల‌లో న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు. 2011లో ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గెలుచుకున్న ఇర్ఫాన్ 25 ఏళ్ళ కెరీర్‌లో సినిమా, టీవీల‌లో ప‌ని చేశారు.  స‌లాం బొంబాయి కోసం ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన ఆయన అనేక ప్ర‌శంస‌లు అందుఉన్నారు.

హిందీ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత టాలెంట్ ఉన్న వ్య‌క్తుల‌లో ఇర్ఫాన్ ఒకరు. 90 ల కాలంలో ఏక్ డాక్ట‌ర్ కి మౌట్ , బ‌డా దిన్ వంటి చిత్రాల‌లో న‌టించాడు. ఇండో- బ్రిటీష్ ప్రొడ‌క్ష‌న్ ది వారియ‌ర్ చిత్రంతో అత‌ను లైమ్ లైట్‌లోకి వ‌చ్చారు. ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో ఈ చిత్రం అత్యుత్త‌మ చిత్రంగా నిలిచింది. 

హిందీ టెలివిజ‌న్‌లోను ఇర్ఫాన్ త‌న స‌త్తా చాటారు. చంద్ర‌కాంత‌, బ‌నేగీ అప్నీ బాత్ , స్టార్ బెస్ట్‌సెల్ల‌ర్స్ అత‌నికి ఎంతో గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ఆ త‌ర్వాత మానో యా నా మ‌నో అనే షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు ఇర్ఫాన్ . ఇక 2003లో వ‌చ్చిన హాసిల్ చిత్రం ఇర్ఫాన్ దిశ ద‌శ‌ని మార్చింది. ఇందులో అలహాబాద్‌కి చెందిన‌ విద్యార్థి నాయకుడిగా నటించాడు. ఈ చిత్రానికి గాను అనేక అవార్డులు కూడా అందుకున్నారు. ప్ర‌యోగాల‌కి భ‌య‌ప‌డని ఈ నటుడిని నిర్మాత‌లు అన్ని ర‌కాలుగా వినియోగించుకున్నారు. మ‌క్భుల్‌, ఆన్‌, రోడ్ టు ల‌డ‌ఖ్, రోగ్ చిత్రాలు ఇర్ఫాన్ కెరియ‌ర్‌కి బాస‌టగా నిలిచాయి. 

ఇక ఏ మైటీ హార్ట్, లైఫ్ ఇన్ ఎ మెట్రో, ది నేమ్‌సేక్, ది డార్జిలింగ్ లిమిటెడ్, ముంబై మేరీ జాన్, స్లమ్‌డాగ్ మిలియనీర్ మరియు సాత్ ఖూన్ మాఫ్ వంటి చిత్రాలు ఇర్ఫాన్‌కి  స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగేలా చేశాయి. పాన్ సింగ్ థోమ‌ర్ చిత్రంలో అత‌ని పాత్ర‌ని ఛాలెంజ్‌గా తీసుకొని న‌టించారు.  ఇటీవ‌లి కాలంలో హిందీ మీడియం, ఖరీబ్ ఖరీబ్ సింగిల్ వంటి ప్రశంసలు పొందిన చిత్రాలలో నటించాడు. చివరిసారిగా ఆంగ్రేజీ మీడియంలో కనిపించాడు, ఇది ఇప్పటికీ సినిమా హాళ్ళలో నడుస్తోంది.

తెలుగులో సైనికుడు చిత్రంలో న‌టించిన ఇర్ఫాన్ ఖాన్  స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. 


logo