బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 29, 2020 , 12:16:23

ఇర్ఫాన్ ఖాన్ క‌న్నుమూత‌.. బాలీవుడ్ దిగ్భ్రాంతి

ఇర్ఫాన్ ఖాన్ క‌న్నుమూత‌..  బాలీవుడ్ దిగ్భ్రాంతి

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్(53) కొద్ది సేప‌టి క్రితం తుది శ్వాస విడిచారు. 2018 లో న్యూరోఎండోక్రిన్ ట్యూమర్‌తో బాధపడ్డ ఆయ‌న  లండ‌న్‌లో చికిత్స పొందారు. కోలుకున్న త‌ర్వాత  ఇండియాకి వ‌చ్చారు. అయితే మంగ‌ళవారం ఇర్ఫాన్ అనారోగ్యానికి గురికావ‌డంతో  ముంబైలోని కోకిలాబెన్ ఆసుప‌త్రికి తర‌లించారు. చికిత్స పొందుతూ ఆయ‌న క‌న్నుమూశారు.

ఇర్ఫాన్ త‌ల్లి  ‌సైదా బేగం ఎప్రిల్ 25 ఉదయం కన్ను మూసింది. లాక్‌డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు. త‌ల్లి చ‌నిపోయి కొద్ది రోజులు కూడా కాక‌ముందే ఇర్ఫాన్ ఇలా ఆక‌స్మాత్తుగా క‌న్నుమూయ‌డంతో కుటుంబ స‌భ్యులు క‌న్నీటి ప‌ర్యంత అవుతున్నారు. ఆయ‌న మృతితో బాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి చెందింది. ఇర్ఫాన్ ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని దేవుడిని ప్రార్ధించారు. ఇర్ఫాన్ చివ‌రిగా  ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు.

ఇర్ఫాన్ ఖాన్  పాన్ సింగ్ తోమర్ సినిమాకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’. అంతేకాదు తన నటనతో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కాలు అందుకున్నారు.తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు . 

ఇర్ఫాన్‌కు భార్య సుతాపా సిక్దార్‌, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇర్ఫాన్‌ బాలీవుడ్‌ సినిమాలే కాకుండా స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. 


logo