మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 24, 2020 , 01:16:55

కథానాయిక అన్వేషణలో..

కథానాయిక అన్వేషణలో..

చిత్రసీమలో నాయకానాయికల కాంబినేషన్‌లు కుదరడం అంత సులభం కాదు. ముఖ్యంగా కథానాయికల ఎంపికలో ఒక్కోసారి సుదీర్ఘ అన్వేషణ జరుగుతుంది. ఓవైపు సినిమాకు అన్నీ సిద్ధంగా ఉన్నా..నాయికల్ని ఎంపిక చేయడంలో జాప్యం చోటుచేసుకుంటుంది. ప్రస్తుతం సెట్స్‌మీదున్న, ప్రకటించిన భారీ సినిమాల్లో కథానాయికలు ఎవరన్నది ప్రశ్నార్థకంగా  మారింది.

‘సింహా’, ‘లెజెండ్‌' తర్వాత బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్‌ చిత్రం రూపొందుతోంది.  లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా చిత్రీకరణను త్వరలోనే పునఃప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చింది. షూటింగ్‌ను ప్రారంభించి చాలా రోజులైనా చిత్రబృందం మాత్రం కథానాయిక కోసం ఇంకా అన్వేషణ సాగిస్తూనే  ఉంది.  బాలకృష్ణకు జోడీగా కొత్త హీరోయిన్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచనలో దర్శకుడు బోయపాటి శ్రీను ఉన్నట్లు తెలిసింది.  మలయాళ నటి ప్రగ్యామార్టిన్‌ను హీరోయిన్‌ను ఎంపికచేసినట్లు  వార్తలొస్తున్నాయి. అలాగే సీనియర్‌ నాయికలు మీనా, సిమ్రాన్‌, జయప్రదలలో ఒకరు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో పీరియాడికల్‌ కథాంశంతో పాన్‌ ఇండియన్‌ చిత్రం రూపొందుతోంది. లాక్‌డౌన్‌కు ముందు పదిహేను రోజులు షూటింగ్‌ చేశారు. కరోనా ప్రభావంతో ఆ తర్వాత వాయిదావేశారు. ప్రస్తుతం నాయికల ఎంపికపై చిత్రబృందం దృష్టిసారించినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో ఇద్దరూ హీరోయిన్లకు చోటున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ నాయికతో పాటు ఓ తెలుగు హీరోయిన్‌ను తీసుకోవాలనే యోచనలో క్రిష్‌ ఉన్నట్లు చెబుతున్నారు. శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ఈ సినిమాలో కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘సాహో’ చిత్రంలో ప్రత్యేక గీతంలో అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నది జాక్వెలిన్‌.  ప్రగ్యాజైస్వాల్‌ రెండో హీరోయిన్‌గా నటించనున్నట్లు చెబుతున్నారు. 

‘ఆదిపురుష్‌'లో సీత ఎవరనే ప్రశ్న ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రభాస్‌ కథానాయకుడిగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ నిర్ధేశకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆదిపురుష్‌'. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో  పౌరాణిక ఇతివృత్తంతో ఈసినిమాను రూపొందించబోతున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో  ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. అతడి సరసన నటించే నాయిక కోసం ప్రస్తుతం చిత్రబృందం వెతుకుతోంది. సీత పాత్ర కోసం కీర్తిసురేష్‌, కియారా అద్వాణీ,అనుష్కశర్మతో పాటు బాలీవుడ్‌, దక్షిణాదికి చెందిన  అగ్రనాయికల పేర్లు  వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికి ఎంపికచేస్తారో చూడాల్సిందే. నాని కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందనున్న చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్‌'.  రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించనున్నారు. విభిన్నమైన కథ, కథనాలతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా సెట్స్‌పైకి రావడం ఆలస్యమైంది. త్వరలో షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలుచేస్తోంది. ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  అలాగే గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చిత్రం ‘శాకుంతలం’. పౌరాణిక ఇతివృత్తంతో  తెరకెక్కనున్న ఈ చిత్రంలో అపురూర సౌందర్యవతి అయిన శకుంతల పాత్రకు న్యాయం చేయగల నాయిక కోసం గుణశేఖర్‌ అన్వేషిస్తున్నారు. ఈ సినిమా కోసం అనుష్క, పూజాహెగ్డే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కబోతున్నది. ఇటీవలే ఈచిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాలో అఖిల్‌ జోడీ కోసం యూనిట్‌ వెతుకుతున్నారు. రష్మిక మందన్నతో ఆ స్థానాన్ని భర్తీ చేయబోతున్నట్లు సమాచారం.