బుధవారం 08 జూలై 2020
Cinema - Jun 01, 2020 , 23:56:14

నేనే బెస్ట్‌ స్టూడెంట్‌

నేనే బెస్ట్‌ స్టూడెంట్‌

‘నేను స్కూల్‌ రోజుల్లో బెస్ట్‌ స్టూడెంట్‌ను. అందుకు ఈ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌లే సాక్ష్యం’ అని అంటోంది చెన్నై సొగసరి సమంత. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ అక్కినేని ఇంటివారి కోడలు తాజాగా తన స్కూల్‌ రిపోర్ట్స్‌ తాలూకు ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. వాటిని చూసిన వారందరూ  ఈ అమ్మడు చదువులో కూడా ఉత్తమ విద్యార్థి అంటూ కితాబిస్తున్నారు. ‘ఈ అమ్మాయి చక్కటి ప్రతిభాశీలి. మా స్కూల్‌కే పెద్ద ఎస్సెట్‌' అంటూ సమంత గురించి ఉపాధ్యాయురాలు నోట్స్‌లో పేర్కొనడం అందరిని ఆకట్టుకుంటోంది. వెండితెరపై అగ్ర కథానాయికల్లో ఒకరిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ సుందరి చదువులో కూడా బెస్ట్‌ పర్‌ఫార్మర్‌ అంటూ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇదిలావుండగా ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఫాలోవర్స్‌ సంఖ్య కోటి మందికి చేరుకుంది. విధేయులైన కోటి మంది అభిమానగణాన్ని సంపాదించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని సమంత ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ సొగసరి తమిళంలో విజయ్‌సేతుపతి సరసన ‘కాతువాకుల రెండు కాదల్‌' చిత్రంతో పాటు అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో ఓ హారర్‌ సినిమాలో నటిస్తోంది.


logo