సోమవారం 01 జూన్ 2020
Cinema - May 16, 2020 , 22:26:42

మద్యం అందిస్తే సినిమా చూస్తారా?

మద్యం అందిస్తే సినిమా చూస్తారా?

కరోనా ప్రభావంతో అమలుపరుస్తున్న లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా చిత్రీకరణలు, విడుదలలు, థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ తరువాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? లేదా? వచ్చినా ఏ మేరకు వస్తారు అనేది ప్రశ్నార్థకంగానే వుంది. ఈ విషయంపై సినీ పెద్దలు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ‘మహానటి’ దర్శకుడు నాగ్‌అశ్విన్‌ సోషల్‌మీడియా వేదికగా చేసిన ఓ ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. థియేటర్లు తిరిగి ప్రారంభించిన తరువాత ప్రేక్షకులతో థియేటర్లు కిక్కిరిసి పోవాలంటే ఏం చేయాలి? అని ఆయన నెటిజన్లను కోరారు. ‘ప్రేక్షకులకు సినిమా హాల్‌లో వైన్‌, బీర్‌ లాంటి మద్యం అందించే విధంగా అనుమతి పొందితే సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందా? అని ఓసారి సురేష్‌బాబు, రానాతో మాట్లాడుకున్నాం. ఈ విషయంపై మీరు ఏమీ అనుకుంటున్నారు? ఇది మంచి ఆలోచనా? లేదా చెడు ఆలోచనా? ఏది ఎలా అనుకున్నా ఒకవేళ ఈ ఆలోచన కార్యరూపం దాల్చితే సినిమాకు వచ్చే కుటుంబ ప్రేక్షకులు తగ్గిపోతారు అనడంలో ఎటువంటి సందేహాం లేదు. వైన్‌,బీర్‌ అందించే ఆలోచన కేవలం కొన్ని మల్టీప్లెక్స్‌లకు మాత్రమే పరిమితం కావొచ్చు. కానీ నా దృష్టిలో ఇది సమస్యకు పరిష్కారం కాదు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తదుపరి థియేటర్లలో నెంబర్‌ ఆఫ్‌ ఆడియన్స్‌ పెరగాలంటే ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి? మీ సలహాలు ఇవ్వండి. థియేటర్లు ప్రారంభించగానే మీరు సినిమాలకు వస్తారా? లేదా? ఇంకెంతకాలం వేచిచూస్తారు? అని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నెటిజన్లను కోరారు. logo