గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 02:51:52

అదాశర్మ పిల్లో పిల్లి కథ

అదాశర్మ పిల్లో పిల్లి కథ

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఉదంతం తర్వాత సినీరంగంలో వేళ్లూనుకుపోయిన బంధుప్రీతి, తారల వారసుల ఆధిపత్య పోకడలపై విస్త్రతమైన చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బాలీవుడ్‌ చిత్రసీమ రెండుగా విడిపోయి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు కథానాయికలు నెపోటిజం గురించి తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ సొగసరి అదాశర్మను ఈ విషయమై స్పందించమని కోరగా వ్యంగ్యాత్మక ధోరణిలో సమాధానమిచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘నా దగ్గర పిల్లి బొమ్మ రూపంలో ఉన్న ఒక పిల్లో (దిండు) ఉంది. దానికి రాధాశర్మ అని పేరు పెట్టాను. ఎక్కడకు వెళ్లినా రాధాను నాతో పాటే తీసుకెళ్తుంటా. ఆ బొమ్మ తో రకరకాల విన్యాసాలు చేస్తూ నవ్విస్తుంటాను.

రాధా నా వారసురాలు అనే ఇమేజ్‌ను తీసుకొచ్చాను (నవ్వుతూ). ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాధాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక ఖాతా ఉంది. అరవై వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. రాధాను వాణిజ్య ప్రకటనల కోసం అడుగుతున్నారు. దీనిని బట్టి  వారసుల సంతానానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు’ అని చమత్కరించింది. తనకు ఎలాంటి సినీ నేపథ్యం లేకున్నా పుష్కరకాలంగా తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమల్లో రాణిస్తున్నానని..వారసత్వం లేకున్నా ప్రతిభతో కూడా అవకాశాలు వరిస్తాయని చెప్పింది. ప్రస్తుతం అదాశర్మ తెలుగులో ‘క్వశ్చన్‌మార్క్‌' అనే సినిమాలో నటిస్తోంది.


logo