గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 00:14:02

అనురాగ్‌తో సంబంధాల్ని తెంచుకుంటా...

అనురాగ్‌తో సంబంధాల్ని తెంచుకుంటా...

 దర్శకుడు అనురాగ్‌కశ్యప్‌పై పాయల్‌ఘోష్‌ చేసిన ఆరోపణలు నిజమైతే అతడితో  ఉన్న స్నేహసంబంధాల్ని తెంచుకునే  మొదటి వ్యక్తిని తానే అవుతానని అంటోంది తాప్సీ. స్వార్థప్రయోజనాలతో కొందరు మీటూ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించింది. బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నటి పాయల్‌ఘోష్‌ ఇటీవల ఆరోపించింది.  అతడిని శిక్షించాలంటూ పేర్కొంది.  ఈ ఆరోపణలకు సంబంధించి అనురాగ్‌ కశ్యప్‌కు అతడి మాజీ భార్యలు కల్కి కోచ్లిన్‌,  ఆర్తిబజాజ్‌తో పాటు కథానాయిక తాప్సీ సహా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు మద్దుతునిస్తున్నారు.  తాప్సీ మాట్లాడుతూ ‘అనురాగ్‌కశ్యప్‌ మహిళల్ని ఎంతో గౌరవిస్తుంటారు. తన సినిమాల్లో పురుషులతో సమానంగా మహిళలకు ప్రాతినిథ్యం కల్పిస్తుంటారు. స్త్రీల పట్ల  అతడు అమర్యాదగా ప్రవర్తించిన  సంఘటనలు ఎప్పుడూ చూడలేదు.అనురాగ్‌కశ్యప్‌పై పాయల్‌ఘోష్‌ చేసిన ఆరోపణలు నిజమని తెలితే అతడితో  ఉన్న స్నేహసంబంధాల్ని తెంచుకుంటా. ఆ పనిచేసే మొదటి వ్యక్తిని నేనే అవుతా. ఈ ఆరోపణల్లోని నిజానిజాలేమిటో తేలాలి. పరిశోధన అసంపూర్తిగా  ఉంటే నిజమైన బాధితులకు న్యాయం జరగదు. మహిళలపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివక్ష, అణిచివేతపై పోరాడేందుకు ఉపయోగించాల్సిన మీటూ ఉద్యమాన్ని కొందరు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు.  ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని పేర్కొన్నది.

logo