e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home ఇంటర్వూ జీవిత రహస్యం తెలుసుకున్నా!

జీవిత రహస్యం తెలుసుకున్నా!

జీవిత రహస్యం తెలుసుకున్నా!

నటుడిగా వెంకటేష్‌ ప్రతిభాకౌశలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్నారు. అయితే తాత్వికచింతన మూర్తీభవించిన వ్యక్తిగా ఆయన జీవిత దృక్కోణం విలక్షణంగా అనిపిస్తుంది. కర్తవ్య నిర్వహణే మన విధి. ఫలితం ఎలా ఉన్నా స్వీకరించాల్సిందేనని ఆయన తరచుగా చెబుతుంటారు. వెంకటేష్‌ కథానాయకుడిగా నటించిన ‘నారప్ప’ చిత్రం ఈ నెల 20న అమెజాన్‌ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన అంతరంగావిష్కరణ ఇది..

ఓటీటీ వేదికపై తొలిసారి మీ చిత్రం విడుదలకాబోతుండటం ఎలా అనిపిస్తోంది?
ఓటీటీ లేదా థియేటర్‌ రిలీజ్‌…ఇలాంటి వాటి గురించి నేను పెద్దగా పట్టించుకోను. నా కర్తవ్యాన్ని అంకితభావంతో నిర్వర్తించడంపైనే దృష్టిపెడతాను. అలా ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలకు నా జీవితంలో ఎప్పుడూ తావులేదు. కేవలం నటన గురించే ఆలోచిస్తా. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందనే ఫిలాసఫీని నేను బలంగా విశ్వసిస్తా. నేను తీసుకున్న నిర్ణయాలు తప్పో ఒప్పో కాలమే సమాధానం చెబుతుంది.

- Advertisement -

అగ్ర కథానాయకుడి సినిమా ఓటీటీలో వస్తుందంటే అభిమానులు కాస్త నిరుత్సాహపడతారు కదా..?
కెరీర్‌ ఆరంభం నుంచి అభిమానులు నన్ను అర్థం చేసుకుంటున్నారు. ఓటీటీ రిలీజ్‌ అనగానే కొందరు అభిమానులు నిరుత్సాహపడ్డారని తెలిసింది. వాళ్లకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటివి ఒక్కోసారి జరుగుతుంటా యి. థియేటర్లో కూడా నా సినిమాలు చూసే సమయం రాబోతుంది. అందుకు కొంచెం ఓపికపట్టాలి. ‘నారప్ప’ చిత్రాన్ని అభిమానులు ఓటీటీలో కూడా ఆస్వాదిస్తారని నమ్ముతున్నా.

‘అసురన్‌’ కథాంశంలో మీకు బాగా నచ్చిన అంశాలేమిటి?
ధనుష్‌, వెట్రిమారన్‌ కలిసి సృష్టించిన ఓ క్లాసిక్‌ చిత్రం ‘అసురన్‌’. నా కెరీర్‌లో ఇలాంటి సినిమా ఇప్పటివరకు చేయలేదు. హృదయాన్ని బరువెక్కించే భావోద్వేగాలు, కథలో సహజత్వం..బలమైన సామాజిక అంశాలు నన్ను కదిలించాయి. ఇలాంటి సినిమా చేస్తే ఓ ఛాలెంజ్‌గా ఉంటుందనుకున్నా. రీమేక్‌లు చేయడం సవాలుతో కూడుకున్న పని. మాతృకలో నటించిన హీరో తాలూకు ఛాయలు కనిపించకుండా మన శైలిలో పాత్రకు న్యాయం చేయాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. నా కెరీర్‌లో చాలా రీమేక్‌లు చేశాను. ప్రేక్షకులు వాటిని ఆదరించారు.

రీమేక్‌ సినిమాల్లో నటించేటప్పుడు ఎలాంటి సవాళ్లుంటాయి?
సాధారణంగా రీమేక్‌ కథ అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతాయి. ఒరిజినల్‌ కంటే బెటర్‌గా తమ హీరో నటించాలని అభిమానులు కోరుకుంటారు. ఇలాంటి సమీకరణాల్ని బ్యాలెన్స్‌ చేస్తూ సినిమా చేయడం అంత సులభం కాదు. కెరీర్‌లో ఎక్కువగా రీమేక్‌ సినిమాలు చేయడానికి ప్రత్యేకమైన కారణమేమీ లేదు. కథలు నచ్చడంతో అలా కుదిరింది.

‘నారప్ప’లో మీ పాత్ర పరంగా ఎలాంటి కసరత్తు చేశారు?
నా కెరీర్‌లోనే ఛాలెజింగ్‌ పాత్ర ఇది. లుక్‌ మొదలుకొని యాక్షన్‌ ఘట్టాల వరకు ప్రతిదీ ఓ సవాలుగా అనిపించింది. ఈ స్థాయి ఎమోషనల్‌ యాక్షన్‌ ఘట్టాల్లో నటించి చాలా రోజులైంది. ఆ సీన్స్‌ చాలా సహజంగా ఆవిష్కృతమయ్యాయి. పాత్ర నుంచి మనసు డైవర్ట్‌ కాకుండా ఉండటానికి యాభైరోజుల పాటు అదే గెటప్‌లో ఉన్నా. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి బలమైన ఉద్వేగాలు ఉన్న పాత్ర లభించడం అదృష్టంగా భావించా. షూటింగ్‌ తర్వాత ప్రతిరోజు ఓ సర్‌ప్రైజ్‌లా అనిపించేది. ‘నారప్ప’ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం వల్ల అనుకున్న మేరకు ఫలితం వచ్చిందనుకుంటున్నా.

రీమేక్‌ సినిమా అంటే ఒరిజినల్‌తో పోల్చి చూస్తారు కదా?
రీమేక్‌ సినిమా అంటే పోలికలు రావడం చాలా సహజం. చంటి, సుందరకాండ సినిమాల నుంచి అలా జరుగుతూనే ఉంది. పోలికల గురించి ఆలోచించకుండా నా పరిధిలో పాత్రకు న్యాయం చేయడం గురించే ఆలోచిస్తా. ఫలితం ఏంటనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ‘నారప్ప’కు అనుభవజ్ఞులైన నటీనటులు కుదిరారు. ఇలాంటి కథ ఇప్పటివరకు తెలుగులో రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నా.

నారప్ప, దృశ్యం-2, ఎఫ్‌-3..ఇలా మూడు భిన్నమైన సినిమాల్ని ఓకే సమయంలో చేయడం ఎలా అనిపిస్తోంది?
ఒకే సమయంలో వైవిధ్యమైన చిత్రాల్ని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి సమయాల్లో పాత్రలపరంగా కొంచె కన్ఫ్యూజన్‌కు ఆస్కారం ఉంటుంది. అయితే సినిమా పూర్తయిన వెంటనే నేను పాత్ర నుంచి త్వరగా బయటపడతా. ‘నారప్ప’ చిత్రాన్ని ఒకటే లాంగ్‌షెడ్యూల్‌లో చేశాం కాబట్టి పాత్రపరంగా ఎలాంటి ఇబ్బంది రాలేదు.

గత కొంతకాలంగా తెలుగులో ఎన్నో ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్స్‌ వస్తున్నాయి కాబట్టి రీమేక్‌ చేయాల్సిన అవసరం లేదని చాలా మంది హీరోలు అనుకుంటున్నారు.. దీనిపై మీరేమంటారు?
ఆ ప్రశ్న నాకెప్పుడూ రాలేదు. కుడి లేదా ఎడమ..ఏ దారిలో ప్రయాణించాలనే విషయం గురించి ఎక్కువగా ఆలోచించను. నా అంతరంగంలోంచే జీవితాన్ని వీక్షిస్తాను. తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటా. అనవసర అంశాల గురించి ఆలోచిస్తూ తప్పా? ఒప్పా అనే సందిగ్ధంలో ఉంటే జీవితం ముగిసిపోతుంది. మనం అడిగింది ఎప్పుడూ రాదు. వచ్చినదానిని స్వీకరించాలన్నదే నా తత్వం. పనిచేసుకుంటూ పోవడమే నాకు తెలుసు. ఫలితం గురించి విధి నిర్ణయానికే వదిలేస్తా.

నాకు జీవితం గురించి సీక్రెట్‌ తెలిసిపోయింది. ఏదీ మన చేతిలో ఉండదు. పొద్దున లేచి పనిచేయడం వరకే మన విధి. ఎన్నో సంవత్సరాల నుంచి నేను పదేపదే ఈ ఫిలాసఫీనే చెప్పడం వల్ల కూడా బోర్‌కొడుతుందేమో (నవ్వుతూ). కరోనా మహమ్మారి మనకు ఎన్నో జీవితపాఠాల్ని నేర్పింది. మన చేతిలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆశావహ దృక్పథంతో మన దగ్గర ఉన్న వనరులతో సంఘటితంగా ప్రమాదాన్ని ఎదుర్కోవాలనే జాగ్రత్తను నేర్పింది.

మార్పును అంగీకరించి నడచుకుంటే మంచిదే. ఓటీటీ, థియేటర్‌ రెండు వేదికల మీద ప్రేక్షకులు సినిమాల్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. నా వరకైతే మంచి సినిమాలు చేయడం గురించి ఆలోచిస్తా. దానిని ప్రేక్షకులు ఏ వేదికమీద రిసీవ్‌ చేసుకున్నా సంతోషమే.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జీవిత రహస్యం తెలుసుకున్నా!
జీవిత రహస్యం తెలుసుకున్నా!
జీవిత రహస్యం తెలుసుకున్నా!

ట్రెండింగ్‌

Advertisement