శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 04, 2020 , 22:37:18

ఆమిర్‌ పాట..షారుఖ్‌ ఆట

ఆమిర్‌ పాట..షారుఖ్‌ ఆట

కరోనా రక్కసిపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది కోసం విరాళాల సేకరణకు సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల సెలబ్రిటీలతో ఆన్‌లైన్‌ ఫండ్‌ రైజింగ్‌ చేపట్టింది. భారత్‌లో ‘ఐ ఫర్‌ ఇండియా’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో షారుఖ్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌, హృతిక్‌రోషన్‌, మాధురీదీక్షిత్‌, అలియాభట్‌, ప్రియాంకచోప్రా, కరీనాకపూర్‌, విద్యాబాలన్‌, ఐశ్వర్యరాయ్‌ వంటి బాలీవుడ్‌ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా పాటల్ని ఆలపించడంతో పాటు కవితాపంక్తుల్ని చదివి వినిపించారు. ఆమిర్‌ఖాన్‌ తన సతీమణి కిరణ్‌రావ్‌తో కలిసి ‘ఆ ఛల్‌కే తుఝే మై లేకే చలూ’ ‘జీనా ఇసికా నామ్‌హై’ వంటి పాపులర్‌ గీతాల్ని ఆలపించారు. ‘ఈ సంక్షోభ సమయం లో పరస్పరం విశ్వాసం, సహకారంతో ఈ పోరాటంలో జయం సాధించాలి’ అని ఆమిర్‌ఖాన్‌ పేర్కొన్నారు. గీత రచయిత సైనీ రాసిన ‘స బ్‌ సహీ హోజాయేగా’ అనే పాట ను షారుఖ్‌ఖాన్‌ ఆలపించారు. తనయుడు అబ్‌రామ్‌తో కలిసి నృత్యం చేశారు.  ‘నేను ఇప్పటివరకు పాటలు పాడలేదు. నాకు ఆ విద్య తెలియదు. కానీ కరోనాపై పోరాటం చేస్తున్న యోధుల కోసం నా గళం విప్పాను. త్వరలో ప్రజలందరూ కరోనా మహమ్మారి నుంచి క్షేమంగా బయటపడతారనే నమ్మకం ఉంది’ అని చెప్పారు షారుఖ్‌ఖాన్‌. మాధురీదీక్షిత్‌ తన కుమారుడు ఆరిన్‌తో కలిసి పాప్‌గాయకుడు ఎడ్‌షీరన్‌ ‘పర్‌ఫెక్ట్‌' గీతాన్ని ఆలపించింది. అలియాభట్‌ తన చెల్లెలు షహీన్‌..స్వరకర్త అంకుల్‌ తివారితో కలిసి ‘ఉడ్తా పంజాబ్‌' చిత్రంలోని ‘ఏక్‌ కుడి’ పాటతో పాటు తన తండ్రి మహేష్‌భట్‌ డైరెక్ట్‌ చేసి ‘దిల్‌హై కి మాన్తా నహీ’ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ను ఆలపించారు. ఈ ఫండ్‌ రైజింగ్‌ ద్వారా ఒక్కరోజులోనే  52కోట్ల విరాళాల్ని సేకరించినట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. 


logo