కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అన్నీ స్తంభించిన సంగతి తెలిసిందే. దీంతో సినీ కార్మికులకు పూట గడవడం కష్టంగా మారింది. పరిస్థితి తెలుసుకున్న ప్రముఖులు వారికి అండగా నిలుస్తూ నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ టీవీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
సినీ,టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు రూ. 20 లక్షల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర వస్తువుల కిట్లు అందించారు హృతిక్ రోషన్ . ఈ విషయాన్ని సంస్థ ప్రధాన కార్యదర్శి అమిత్ బెహల్ తెలిపారు. ఈ మొత్తాన్ని 5 వేల మంది సభ్యులకు వ్యాక్సిన్‌తో పాటు నిత్యావసరాల కోసం ఉపయోగిస్తామని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది కరోనా సమయంలోను పాతిక లక్షల రూపాయల సాయం చేశారు హృతిక్. మరో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ రెండున్నర లక్షల రూపాయలు విరాళంగా అందించారు,