బావి ఈశాన్యంలోనే ఉండాలంటారు. మా పొలం దగ్గర అలా లేదు. ఏం చేయమంటారు? – రత్నాల రాంచందర్, కొంపల్లి
వ్యవసాయ స్థలాల్లో బావులు, చెరువులు శాస్ర్తానుకూలంగా ఉండవు. బావులు దిశానుకూలంగా కాకుండా.. దక్షిణంలోనో, పడమరలోనో ఉంటాయి. కొన్నిసార్లు స్థలం దక్షిణం అంచెలంచెలుగా వాలు కలిగి ఉత్తరం ఎత్తుగా ఉండి, దక్షిణంలో బావి ఉంటుంది. అలాగని ఆ స్థలం వ్యవసాయానికి పనికి రాదని అనుకోవద్దు. అలాగే బావి ఎక్కడ ఉన్నా దోషం ఉండదు. ఆ కూపంలో నీరు సమృద్ధిగా ఉందో లేదో చూసుకొని సాగు చేయాల్సిందే. మీకున్న బావిని మరింత పూడికతీసి, నీటిని వృద్ధి పరుచుకొని వ్యవసాయం చేసుకోండి. నీటి వాటం ప్రకృతి సిద్ధంగా కుదురుతుంది. దానిని యాథావిధిగా పొలం పనులకు వాడుకోవటం వల్ల ఏ సమస్యా ఉండదు. ఎన్నో ప్రాంతాల్లో పడమర వాగులో నుంచి నీటిని తోడుకొని పంటను పండిస్తున్న దాఖలాలు ఉన్నాయి.
ఒకప్పుడు ఎనిమిది అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పుతో గదుల కట్టేవారు. ఇప్పుడు ఆ కొలతలు సరిపోవు కదా? – నిత్య, తెల్లాపూర్
మనిషి ఎదుగుతున్న కొద్దీ సాంకేతికత వృద్ధి చెందుతున్నది. ఒకప్పుడు గుహలో, చెట్ల మీద నివసించిన మనిషి నేడు గృహాన్ని శాస్త్రబద్ధంగా … సౌకర్యంగా నిర్మించుకున్నాడు. సకల సుఖాలు పొందుతున్నాడు. గోచీ పెట్టుకుంటేనే పాండిత్యం వస్తుందనేది సత్యం కాదు. ‘జ్ఞాని’ గోచి పెట్టుకోవాలనేం లేదు. ఇంటి కొలతలు ఎంత ప్రమాణంలో కావాలో అంత తీసుకోవచ్చు. పొట్టి మనిషికి అన్ని అవయవాలు ఉన్నట్టే, పొడుగు మనిషికి కూడా అన్ని అంగాలూ ఉంటాయి. ఇక్కడ పొట్టి, పొడుగు ముఖ్యం కాదు. తయారు చేసింది పూర్ణమానవుడినా, కాదా? అన్నది ప్రధానం. ఇల్లు కూడా అంతే! ఎవరి అవసరాలు వారివి. ఆనాడు, ఆయా ప్రాంతాలలో దొరికే వస్తు సామాగ్రిని బట్టి, వాతావరణాన్ని బట్టి ఇంటి నిర్మాణాలు చేసేవారు. అప్పుడు స్తంభాలకు, దూలాలకు రాతి మూలం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. శాస్త్రం మూలాన్ని అర్థం చేసుకొని గృహ నిర్మాణం జరపాలి. మీకు నచ్చిన విధంగా, వాస్తు పోకుండా ఇల్లు కట్టుకోండి.
వాస్తు పండితులు ‘నీ బిడ్డకు ప్రాణ గండం, నీకు ప్రమోషన్ రాదు!’ అని చెబుతున్నారు. అవన్నీ నిజమా? – నీలం వసుంధర, కొడకండ్ల
ఇంటి నిర్మాణంలో దోషాలు చెడు ఫలితాలు ఇస్తాయి అన్నదాంట్లో ఎలాంటి అసత్యం, అతిశయోక్తి లేదు. అలాగే ఒక్కో దిశ ఆ ఇంట్లోని కొందరిని ప్రస్తావిస్తూ చెబుతుంది. ఉదాహరణకు ఈశాన్యంలో లోపాలు పిల్లలపైన ప్రభావం చూపుతాయి. అది సత్యం. ఆ లోపాన్ని మరీ దారుణంగా, ‘భయపడేలా’ ఎప్పుడూ ఎవరూ చెప్పకూడదు. లోపాన్ని శాస్త్ర హెచ్చరికగా సూచించాలి. ప్రమోషన్, డిమోషన్ అనేవి వాస్తు పదాలు కావు. ఆర్థికాభివృద్ధి, ఆనారోగ్య స్థితి అనేవి తప్పక ఉంటాయి. చెప్పేవాళ్ల సంస్కారాన్ని బట్టి భాషా ప్రయోగం ఉంటుంది. శాస్త్రం చెప్పే అంశాలు నిజమా అనేది చెప్పే వాళ్ల కన్నా, ఆయా గృహాల్లో ఉండే వాళ్లకే ఎక్కువ తెలిసి ఉంటుంది. మీరు మీ గృహంలోని లోపాలను సరిగ్గా తెలుసుకొని బాగు చేయించండి. ఎవరో చెబితే ఫలితం రాదు. మీరు ఇంటిని సరిచేసుకుంటేనే మంచి ఫలితాలు కలుగుతాయి.