గురువారం 04 జూన్ 2020
Cinema - Feb 24, 2020 , 00:11:15

‘హిట్‌' సినిమా ఫ్రాంచైజ్‌గా మారాలి!

‘హిట్‌' సినిమా ఫ్రాంచైజ్‌గా మారాలి!

“హిట్‌' సినిమా ఓ ఫ్రాంచైజ్‌గా మారాలి.  సినిమాకు  మరిన్ని భాగాలు రూపొందాలి’ అని అన్నారు అగ్ర దర్శకుడు రాజమౌళి. హీరో నాని సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘హిట్‌'. విష్వక్‌సేన్‌, రుహానిశర్మ జంటగా నటిస్తున్నారు. ప్రశాంతి తిపిరినేని నిర్మాత. శైలేష్‌ కొలను దర్శకుడు. ఈ నెల 28న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్‌  వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, కథానాయిక అనుష్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బిగ్‌ టికెట్‌ను రాజమౌళి, హీరో రానా విడుదలచేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ‘ టీజర్‌, ట్రైలర్‌ అన్నీ బాగున్నాయి.  


స్నీక్‌పీక్‌ ఐడియా చాలా నచ్చింది. ఈ  ఆలోచనను తొలుత హాలీవుడ్‌లో  రూపొందిన ‘2012’ సినిమాకు చూశాను. సినిమాలోని ముఖ్యమైన సీక్వెన్స్‌ను విడుదలకు ముందే ప్రేక్షకులకు చూపించారు. ఆ సీక్వెన్స్‌ చూసిన వారందరూ తర్వాత ఏం జరగబోతుందోననే ఉత్కంఠతో సినిమా కోసం ఎదురుచూశారు. ఆ ఐడియాను ఈ సినిమా కోసం వాడటం బాగుంది. ఈ సినిమా స్నీక్‌పీక్‌  ద్వారా కథ ఏంటి? హీరో రియాక్షన్‌కు కారణమేమిటనే అనే ఉత్కంఠ కలుగుతున్నది’ అని తెలిపారు. 


అనుష్క మాట్లాడుతూ ‘ఈ వేడుకకు నేను అతిథిగా రాలేదు. నాని, ప్రశాంతిలను కుటుంబసభ్యులుగానే భావిస్తాను. ‘అ!’ తర్వాత వారు  నిర్మాతలుగా ఎలాంటి కథతో సినిమా చేస్తారని అందరి మాదిరిగానే నేను ఎదురుచూశాను. ట్రైలర్‌ బాగుంది. ఈ సినిమాను థియేటర్‌లో చూడటానికి  ప్రేక్షకులతో పాటు నేను  ఆసక్తిగా వేచిచూస్తున్నాను’ అని చెప్పింది.  దిల్‌రాజు మాట్లాడుతూ ‘హీరోగా ఉండి కూడా కొత్త కథల్ని, నూతన ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు నాని. ప్రయోగాత్మకంగా అతడు చేసిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు.  


‘హిట్‌' సంతృప్తినిచ్చింది -నాని

హీరో నాని మాట్లాడుతూ ‘ఈ వేదికపై నటుడిగా కాకుండా  నిర్మాతగా  మాట్లాడుతుండటం కొత్తగా ఉంది. శైలేష్‌ ఈ కథ చెప్పిన తర్వాత జాబ్‌ వదిలేసుకొని సినిమా మాత్రం చేయోద్దని అన్నాను.  కానీ సినిమా చూసిన తర్వాత ఉద్యోగం వదిలేయమని చెప్పాను. తొలి దర్శకుడు చేసిన సినిమా అనే అనుభూతి ఎక్కడా కలగదు. దర్శకుడిగా శైలేష్‌ చిత్రసీమలో సుదీర్ఘకాలం కొనసాగుతాడు. విక్రమ్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో విష్వక్‌సేన్‌ అద్భుతంగా నటించాడు. ఏ పాత్రనైనా చేయగల వెర్సటైల్‌ నటుడు. నిర్మాతగా ఈ సినిమాకు నాకు సంతృప్తిని మిగిల్చింది. ‘అ!’ నిర్మాతగా నాకు పేరు, ప్రశంసలు తీసుకొచ్చిందని కానీ కమర్షియల్‌ సక్సెస్‌ సాధించలేదని అంటున్నారు. వాణిజ్యపరంగా సినిమా పెద్ద విజయం సాధించింది. తొలి చిత్రానికి మించి ఈ సినిమా విజయం సాధించాలి’అని పేర్కొన్నారు. 


 ‘అ!’తో నిర్మాతగా మారి నాని పెద్ద విజయాన్ని అందుకున్నాడని, ఆ కాన్ఫిడెన్స్‌తోనే  రెండో సినిమాకు హిట్‌ అనే టైటిల్‌ పెట్టాడని సీనియర్‌ దర్శకుడు రాఘవేంద్రరావు పేర్కొన్నారు. ఈ సినిమాకు రెండో భాగం ఉంటుందని, సరికొత్త అనుభూతిని పంచుతుందని విష్వక్‌సేన్‌ అన్నారు. ‘కథ రాసి నానికి వినిపిస్తే చాలనుకున్నాను. కథ ఆయనకు చెప్పిన తర్వాత నువ్వే దర్శకత్వం చేయమని అన్నారు. ఏడాదిన్నర పాటు డైరెక్షన్‌లో మెళకువలను నేర్చుకొని సినిమా రూపొందించాను. నాని ఒక్క రోజు సెట్‌కురాలేదు. విక్రమ్‌ రుద్రరాజు పాత్రలో విష్వక్‌సేన్‌ అద్భుతమైన అభినయాన్ని కనబరిచాడు ’ అని దర్శకుడు శైలేష్‌ చెప్పారు. తెలుగులో ఇది తన రెండో చిత్రమిదని రుహాని శర్మ చెప్పింది. ఈ కార్యక్రమంలో అల్లరి నరేష్‌, నవదీప్‌, సందీప్‌కిషన్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo