కమల్ హాసన్ సినిమాలకు ఒకప్పుడు తెలుగులో మంచి బిజినెస్ ఉండేది. 80, 90ల్లో ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో అద్భుతమైన విజయం సాధించాయి. అప్పట్లో కమల్ హాసన్ తెలుగులో స్ట్రైట్ సినిమాలు కూడా చేశాడు. అయితే ఆ తర్వాత మెల్ల మెల్లగా ఈయన మార్కెట్ తగ్గుతూ వచ్చింది. గత 20 ఏళ్లలో తెలుగులో కమల్ నటించిన ఏ సినిమా కూడా కమర్షియల్ గా విజయం సాధించిన దాఖలాలు లేవు. మధ్యలో దశావతారం సినిమా మాత్రం పర్లేదు అనిపించింది. విశ్వరూపం కూడా అంచనాలు అందుకోలేక పోయింది. పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత కూడా కమల్ హాసన్ సినిమా థియేటర్లో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు.
ఇక ఈ మధ్య కాలంలో అయితే కమల్ నటించిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపించింది లేదు. ఆయన మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఇంకా చెప్పాలంటే కమల్ సినిమాలు వచ్చి వెళ్లినట్టు కూడా ప్రేక్షకులకు గుర్తు లేదు. ఇలాంటి సమయంలో ఆయన నటించిన ఒక సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది. దాని పేరు విక్రమ్.. ఆ సినిమాపై ఎందుకు అంత క్రేజ్ అంటే దర్శకుడు లోకేష్ కనకరాజ్ కావడమే. ఖైదీ, మాస్టర్ లాంటి సినిమాలతో తెలుగులో కూడా అద్భుతమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు లోకేష్.
దాంతో ఈ కుర్రాడి సినిమాలో విషయం ఉంటుందని తెలుగు ప్రేక్షకులకు కూడా అర్థం అయిపోయింది. ఇప్పుడు కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమా తెరకెక్కిస్తున్నాడు లోకేష్. ఇందులో ఆయనతో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఒకే సినిమాలో ముగ్గురు నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్స్ నటిస్తుండటంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ సినిమా బిజినెస్ తమిళంలో దాదాపు 70 కోట్లకు పైగానే జరుగుతుంది. తెలుగులోనూ 12 కోట్ల వరకు బిజినెస్ జరుగుతున్నట్లు అంచనా. గత కొన్నేళ్లుగా కమల్ సినిమాలకు కనీసం 2-3 కోట్లు కూడా రావడం లేదు. ఇలాంటి సమయంలో విక్రమ్ బిజినెస్ పరంగా అద్భుతాలు చేస్తుంది. ఇదంతా లోకేష్ మహిమ అని అందరికీ తెలుసు. దానికితోడు కమల్ హాసన్ కూడా రెచ్చిపోతే ఇక చెప్పడానికి ఏం లేదు. బాక్సాఫీస్ దగ్గర సునామీ తప్పదు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి రేపు సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.