మహిళా ప్రధాన సినిమాల్లో నటించి మెప్పించడం అంత సులభం కాదని చెప్పింది పంజాబీ సుందరి తాప్సీ. ముఖ్యంగా ఆ తరహా చిత్రాల్ని ప్రజలకు చేరువ చేయడంలో అనేక ఇబ్బందులు ఉంటాయని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించడానికి అగ్ర హీరోలు ఒప్పుకోరు. కథాగమనంలో వారి పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇమేజ్ కోణంలో ఆలోచిస్తారు. కథ మొత్తం నాయికల చుట్టే తిరుగుతుంది కాబట్టి తమ ఇమేజ్ తగ్గిపోతుందని భయపడుతుంటారు. అదే కథానాయికలు కథలో కీలకమనిపించే చిన్న పాత్రకైనా అంగీకరిస్తారు. ఇమేజ్ పట్టింపులు లేకుండా నాయకానాయికలు పరస్పరం సమన్వయంతో పనిచేస్తే మరిన్ని గొప్ప చిత్రాలొస్తాయి. అప్పుడే చిత్రసీమలో మహిళా సాధికారత సాధ్యమవుతుంది’ అని చెప్పింది. ప్రస్తుతం తాప్సీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తొమ్మిది చిత్రాల్లో నటిస్తోంది.