గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 01, 2020 , 22:38:08

ఆటాడుకుందాం రా!

ఆటాడుకుందాం రా!

నాయకానాయికలు క్రీడాకారులుగా మారిపోతున్నారు. రియల్‌లైఫ్‌లో కాదు రీల్‌లైఫ్‌ ఫోర్లు సిక్సర్లతో పాటు గోల్స్‌ కొట్టబోతున్నారు. భాషాభేదాలకు అతీతంగా క్రీడా నేపథ్య కథాంశాలతో సినిమాల్ని తెరకెక్కించే ట్రెండ్‌ ప్రస్తుతం పెరిగింది. ఈ స్పోర్ట్‌డ్రామా చిత్రాలు యువతరాన్ని ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో స్టార్‌ హీరోహీరోయిన్లు ఈ సినిమాల్లో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. నటులుగా తమను తాము సరికొత్త పంథాలో ఆవిష్కరించుకునే ఆస్కారమున్న కథలు కావడంతో క్రీడాకారుల పాత్రల్లో ఒదిగిపోయేందుకు తపిస్తున్నారు.

క్రికెటర్‌గా మైదానంలో ఫోర్లు, సిక్సర్లు కొట్టడానికి రెడీ అవుతోంది తాప్సీ.  భారత మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవితం ఆధారంగా ‘శభాష్‌ మిథు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నది. మిథాలీరాజ్‌ పాత్రలో తాప్సీ నటిస్తున్నది.  రాహుల్‌ డోలాకియా  దర్శకత్వం వహిస్తున్నారు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డ్‌ను సృష్టించింది మిథాలీరాజ్‌. ఇరవై ఏళ్ల కెరీర్‌లో భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాల్ని తెచ్చిపెట్టింది.ఆమె జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం తాప్సీ క్రికెట్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. వెండితెరపై ఈ క్రికెటర్‌ పాత్రకు ప్రాణప్రతిష్ట చేయడానికి మిథాలీరాజ్‌తో తాప్సీ ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపింది.  వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ఈ సినిమాను విడుదల కానుంది.


షూటర్‌గా కీర్తిసురేష్‌

నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో కీర్తి సురేష్‌ కథానాయికగా షూటింగ్‌ క్రీడా నేపథ్యంలో తెలుగులో ఓ సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో కీర్తిసురేష్‌ షార్ప్‌ షూటర్‌ పాత్రలో కనిపించబోతున్నది. పల్లెటూరి నుంచి తన ప్రస్థానాన్ని  మొదలుపెట్టిన ఓ క్రీడాకారిణి  అంతర్జాతీయ స్థాయిలో ఎలా విజేతగా నిలిచిందనే కథాంశంతో స్ఫూర్తిదాయకంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో కీర్తిసురేష్‌ ఢీగ్లామర్‌ లుక్‌లో కనిపించబోతున్నదని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి ‘గుడ్‌లక్‌ సఖి’ అనే పేరును ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆది పినిశెట్టి,జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


హాకీ ప్లేయర్‌ లావణ్య

లావణ్య త్రిపాఠి హాకీ క్రీడలో మెళకువలను నేర్చుకున్నది. నిజమైన ప్లేయర్స్‌తో కలిసి సాధన చేసింది. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌' సినిమా కోసం ఆమె  ఈ కష్టమంతా పడింది.  సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రానికి డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకుడు. హాకీ క్రీడా నేపథ్యంలో తెలుగులో రూపొందుతున్న తొలి చిత్రమిది. ఇందులో లావణ్యారావు అనే మహిళా హాకీ ప్లేయర్‌గా లావణ్య త్రిపాఠి కనిపిస్తున్నది. పాత్రలో పర్‌ఫెక్షన్‌ కోసం ఇటీవలే వారం రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నది లావణ్య త్రిపాఠి. ఇతర సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉండి కూడా ప్రాక్టీస్‌ కోసం హాజరై అంకితభావాన్ని చాటుకున్నట్లు చిత్రబృందం చెబుతున్నారు. నిజమైన హాకీ ప్లేయర్స్‌ను తలపిస్తూ ఛాలెంజింగ్‌గా ఆమె పాత్ర సాగుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. 


కబడ్డీ కోచ్‌ తమన్నా

యువ కబడ్డీ ప్లేయర్స్‌లో ప్రతిభను వెలికితీసే బాధ్యతల్ని చేపట్టింది తమన్నా.  కోచ్‌గా అవతారం ఎత్తింది. ఆమె కథానాయికగా  సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సీటీమార్‌'. గోపీచంద్‌ హీరోగా నటిస్తున్నారు.  ఈ సినిమాలో జ్వాలారెడ్డి అనే తెలంగాణ మహిళా కబడ్డీ టీమ్‌ కోచ్‌గా తమన్నా నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్‌లో అడుగుపెట్టే ముందు తమన్నా కబడ్డీ క్రీడకు సంబంధించిన పదాలు, రూల్స్‌ను తెలుసుకున్నట్లు సమాచారం. 


వెయిట్‌ లిఫ్టర్‌ అంజలి

వెయిట్‌లిఫ్టింగ్‌లో దేశానికి కాంస్య పతాకాన్ని అందించిన తెలుగు క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి జీవిత కథతో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు తెలిసింది. కోన వెంకట్‌ ఈ చిత్రానికి కథను అందించడంతో పాటు స్వీయ నిర్మాణ సంస్థ కోన ఫిల్మ్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని  రూపొందించనున్నట్ల్లు సమాచారం. పాన్‌ ఇండియన్‌ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కరణం మళ్లీశ్వరి పాత్రలో అంజలి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


బాక్సర్‌గా విజయ్‌ దేవరకొండ

 విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియన్‌ చిత్రం రూపొందుతున్నది. ఇందులో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నారు.  చిత్రీకరణ ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్నది. ఈ సినిమా కోసం విజయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో విదేశాల్లో ట్రైనింగ్‌ తీసుకున్నారు. విజయ్‌దేవరకొండ బాటలోనే వరుణ్‌తేజ్‌ అడుగులు వేయబోతున్నారు. తాజా చిత్రంలో బాక్సర్‌గా నటిస్తున్నారు.  క్రీడానేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్‌లో ఈ   సినిమారెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతున్నది. ఆది పినిశెట్టి  హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం రూపొందుతున్నది. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో  తన కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించే  యువ అథ్లెట్‌గా ఆది పినిశెట్టి  కనిపిస్తున్నారు. 


బాలీవుడ్‌ స్పోర్ట్స్‌ మేనియా

దేశానికి తొలి క్రికెట్‌ ప్రపంచకప్‌ను అందించి కోట్లాదిమంది క్రీడాభిమానుల హృదయాల్ని గెలుచుకున్న కపిల్‌దేవ్‌ టీమ్‌ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘83’. కబీర్‌ఖాన్‌  దర్శకుడు. కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తున్నారు. సునీల్‌ గవాస్కర్‌ పాత్రలో తాహిర్‌ రాజ్‌ బాసిన్‌, కృష్ణమాచారి శ్రీకాంత్‌గా జీవా, రోమీ దేవ్‌గా దీపికాపదుకునే.. భిన్న భాషలకు చెందిన నటీనటులు ఈసినిమాలో నటిస్తున్నారు.  ఫుట్‌బాల్‌ క్రీడలో దేశానికి అద్భుతమైన విజయాల్ని అందించిన హైదరాబాదీ కోచ్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవిత కథ ఆధారంగా రుపొందుతున్న చిత్రం ‘మైదాన్‌'. అబ్దుల్‌ రహీం పాత్రలో అజయ్‌దేవ్‌గన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్రియమణి కథానాయికగా నటిస్తున్నది. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో ఆమె పాత్రను పరిణితీ చోప్రా పోషించనున్నది. మరో స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు బయోపిక్‌ను నటుడు సోనూసూద్‌ తెరకెక్కించబోతున్నారు. వీరితో పాటు టెన్నిస్‌స్టార్‌ సానియా మీర్జా జీవిత కథతో దర్శకనిర్మాత రోనీ స్య్రూవాలా  సినిమాను చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

logo