గురువారం 04 జూన్ 2020
Cinema - Feb 26, 2020 , 23:12:33

అపరిచితుల ప్రయాణం

అపరిచితుల ప్రయాణం

శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, ఇంద్రజ, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో గురుప్ప  పరమేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గురుపవన్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జి.మహేష్‌ నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎన్‌.బి. బాలసుబ్రహ్మణ్యం క్లాప్‌నివ్వగా, రాంప్రసాద్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు.  అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘భిన్న నేపథ్యాలు కలిగిన నలుగురు అపరిచితుల కథ ఇది. 


వారంతా కలిసి 3450 కిలోమీటర్లు ఎందుకు ప్రయాణం చేశారు? ఈ జర్నీలో వారికి ఎదురైన అనుభవాలేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. మార్చి 2న తొలి షెడ్యూల్‌, 22న రెండో షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం.  హైదరాబాద్‌, నాగ్‌పూర్‌, గ్వాలియర్‌లలో చిత్రీకరణ జరుపుతాం’ అని తెలిపారు.   కలల సాధన కోసం ప్రయత్నించే గృహిణిగా తన పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుందని ఇంద్రజ చెప్పింది. సుమంత్‌ అశ్విన్‌ మాట్లాడుతూ ‘శ్రీకాంత్‌, ఇంద్రజ వంటి అనుభవజ్ఞులతో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. ‘జీవితంలో ఏదో ఒకటి సాధించాలని తపన పడే ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అయ్యే కథ ఇది.  సందేశం, వినోదం  కలబోతగా మహిళా ప్రధాన కథాంశంతో రూపొందిస్తున్నాం. అన్ని వయసుల వారిని అలరిస్తుంది’ అని నిర్మాత అన్నారు.


logo