శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Mar 02, 2020 , 23:15:27

‘కార్తికేయ-2’ మొదలైంది

‘కార్తికేయ-2’ మొదలైంది

‘చందు మొండేటితో నా కలయికలో యానిమల్‌ హిప్నాటిజం అనే  కొత్త కాన్సెప్ట్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ రూపొందిన ‘కార్తికేయ’ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది.   ఆరేళ్ల తర్వాత మా ఇద్దరి కాంబినేషన్‌లో ‘కార్తికేయ-2’  రూపొందుతుండటం ఉత్కంఠగా అనిపిస్తోంది’ అని అన్నారు నిఖిల్‌. ఆయన కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కార్తికేయ-2’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. సోమవారం తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధానంలో చిత్ర పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. 


నిఖిల్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి కెమెరా స్విఛాన్‌ చేయగా, ఆయన తనయుడు అభినయ్‌రెడ్డి  క్లాప్‌నిచ్చారు. నిఖిల్‌ మాట్లాడుతూ ‘భారతీయ సంప్రదాయాలను అద్భుతమైన రీతిలో ఆవిష్కరించే చిత్రమిది. ఉగాది తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’ అని చెప్పారు. ‘కార్తికేయ’ మాదిరిగానే సీక్వెల్‌ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ ఆక్షాంక్షించారు.  నిర్మాతలు మాట్లాడుతూ ‘ 5118 ఏళ్ల క్రితం నాటి యుగానికి చెందిన అనంత జ్ఞాన సంపదకు సంబంధించిన  రహస్యాన్ని ఓ యువకుడు ఎలా అన్వేషించాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ఆద్యంతం థ్రిల్‌ను పంచుతుంది. తాజాగా విడుదల చేసిన టైటిల్‌ లోగో, కాన్సెప్ట్‌ వీడియోకు చక్కటి స్పందన లభిస్తున్నది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల. logo