బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 07, 2020 , 22:42:27

కార్మికులకు అండగా

కార్మికులకు అండగా

కరోనా విపత్తు కారణంగా కష్టాల్ని ఎదుర్కొంటున్న సామాన్యులకు సినీ తారలు అండగా నిలుస్తున్నారు. విరాళాలు, నిత్యవసర సరుకులు అందించడంతో పాటు వివిధ రూపాల్లో మేమున్నామంటూ ప్రజల్లో కొండంత ధైర్యాన్ని నింపుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక ఇబ్బందులు  పడుతున్న వెయ్యి మందికిపైగా  కార్మికులకు సినీ హీరో గోపీచంద్‌ నెల రోజులకు సరిపడా నిత్యవసర సరుకుల్ని స్వయంగా అందజేశారు. అలాగే నటుడు పోసాని కృష్ణమురళి యాభై నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకుల్ని అందించారు. సినీ నిర్మాత రామ్‌ తాళ్లూరి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఐదు లక్షల్ని విరాళంగా అందించారు. యాభై వేల రూపాయల విలువ చేసే నిత్యవసర సరుకుల్ని సినీ కార్మికులకు అందించారు. బాలీవుడ్‌ నిర్మాత సాజిద్‌ నదియాద్‌వాలా తన సంస్థలో పనిచేసే నాలుగు వందల మంది ఉద్యోగులకు బోనస్‌తో పాటు సినీ కార్మికులకు ఆర్థికంగా సహాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ విపత్తును ఎదుర్కోవడానికి పోరాడాల్సిన  బాధ్యత అందరిపై ఉన్నదని సాజిద్‌ నదియాద్‌వాలా చెప్పారు. logo