శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 12:37:52

బాల‌కృష్ణ 'న‌ర్త‌నశాల' ఫ‌స్ట్ లుక్ రిలీజ్

బాల‌కృష్ణ 'న‌ర్త‌నశాల' ఫ‌స్ట్ లుక్ రిలీజ్

ప్రేమ, యాక్ష‌న్ చిత్రాల‌తోనే కాక పౌరాణిక‌, జాన‌ప‌దా చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న న‌టుడు బాల‌కృష్ణ‌. తండ్రి ఎన్టీఆర్ వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయ‌న కెరీర్‌లో అద్భుత‌మైన చిత్రాలు చేశారు. ప్ర‌స్తుతం బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నారు. క‌ట్ చేస్తే ఎన్టీఆర్ న‌టించిన న‌ర్త‌న‌శాల చిత్రాన్ని ఎంత‌గానో ఇష్ట‌ప‌డే బాల‌కృష్ణ ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో, కీల‌క పాత్ర‌లో కొన్నేళ్ళ క్రితం న‌ర్త‌న‌శాల అనే చిత్రాన్ని ప్రారంభించాడు. షూటింగ్ మొద‌లైన కొద్ది రోజుల‌కే ఇది ఆగిపోయింది. మ‌హాభార‌తంలోని న‌ర్త‌న శాల ఇతివృత్తంగా  ఈ సినిమాని తెర‌కెక్కించాల‌ని బాల‌య్య భావించ‌గా, ఇందులో అర్జునుడిగా బాల‌య్య‌, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు న‌టించారు.

సౌంద‌ర్య హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన త‌ర్వాత ఆగిన ఈ చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టి వ‌ర‌కు మొద‌లు కాలేదు. ఈ మూవీని ఎప్ప‌టికైన పూర్తి చేయాల‌ని బాలయ్య ఆకాంక్ష‌. అయితే  అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా( అక్టోబ‌ర్ 24న‌) ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది అని బాల‌కృష్ణ స్ప‌ష్టం చేశారు. తాజాగా న‌ర్త‌నశాల నుండి బాల‌కృష్ణ‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో బాల‌య్య లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.