శనివారం 30 మే 2020
Cinema - Apr 29, 2020 , 13:31:11

విశిష్ట, విలక్షణ నటుడు ఇర్ఫాన్‌‌ఖాన్

విశిష్ట, విలక్షణ నటుడు ఇర్ఫాన్‌‌ఖాన్

హైదరాబాద్: ఆయనను చూస్తే ఓ అన్నయ్యలా, బాబాయిలా, పక్కింటి అంకుల్‌లా అనిపిస్తాడు. కమర్షియల్ హంగామాలు ఏవీ లేని అసాధారణ నటుడు ఇర్ఫాన్‌ఖాన్. ఒక ఓంపురి, ఒక నసీరుద్దీన్ షా.. ఒక ఇర్ఫాన్ ఖాన్ అని చెప్పుకునేలా జాతీయ, అంతర్జాతీయ కీర్తిశిఖరాలు అధిరోహించిన ఇర్ఫాన్ 53 వ ఏట కన్నుమూయడం సినిమా రంగానికి నిజంగా తీరని లోటు. బాలివుడ్ సంస్కృతికి భిన్నంగా ఎదిగిన విశిష్ట నటుడు. మనవాడు ఎలాంటి హడావుడి, హంగామా లేకుండానే బ్రిటిష్ చిత్రాల్లోనూ, హాలివుడ్‌లోనూ మన జెండా ఎగరేశాడు. అంతర్జాతీయంగా భారతీయ పాత్రలకు కేరాఫ్‌గా మారాడు. ఎలాంటి పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసే సత్తా ఉంది. అతి తక్కువ సమయంలో గుర్తుండిపోయే పాత్రలు ఎన్నో వేశాడు ఇర్ఫాన్ ఖాన్.

పాన్‌సింగ్ తోమార్ ఓ మైలురాయి.  ఇర్ఫాన్‌కు అలాంటి పాత్రలంటే మంచినీళ్లప్రాయం. తోమార్ తనకు జాతీయ ఉత్తమనటుడు అవార్డు తెచ్చిపెట్టింది. 1988లో ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన సలాం బాంబేతో ఇర్ఫాన్ బాలీవుడ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. కానీ చాన్నాళ్లు చిన్నాచితకా పాత్రలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హాసిల్ (2003)తో గుర్తింపు, ఫిలింఫేర్ ఉత్తమ విలన్ అవార్డు వచ్చాయి. మక్బూల్‌(2004)లో మంచిపాత్ర దొరికింది. పేరూ వచ్చింది. లైఫ్ ఇన్ ఎ మెట్రో (2007) తన కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డు లభించింది. పాన్‌సింగ్ తోమార్ (2011) గురించి చెప్పేదేముంది. జాతీయ అవార్డుతోపాటే ఫిలింఫేర్ ఉత్తమనటుడు అవార్డు కూడా లభించింది.

ఆ తర్వాత ఇక వెనుకకు తిరిగి చూసుకోలేదు. లంచ్ బాక్స్ (2013), హైదర్ (2014), గుండే (2014), పీకూ (2015), తల్వార్ (2015) ఇలా ఒకటి తర్వాత ఒకటి మంచి సినిమాలు, మంచిపాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. హిందీ మీడియం (2017) ఓ సెన్సేషన్. మెల్లగా ఊపందుకుని సూపర్ హిట్టయింది. చైనాలో కూడా బాగా ఆడింది. ఇండియా వెలుపల బాగా ఆడిన స్వదేసీ సినిమాగా రికార్డులు సాధించింది. మరో ఫిలింఫేర్ కూడా దక్కింది. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే వారియర్ (2001), నేమ్ సేక్ (2006), ది డార్జీలింగ్ లిమిటెడ్ (2007), ఆస్కార్ గెల్చుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ (2008), న్యూయార్క్ ఐ లవ్ యూ (2009), ద అమేజింగ్ స్పైడర్‌మ్యాన్ (2012), లైఫ్ ఆప్ పై (2012), జురాసిక్ వరల్డ్ (2015), ఇన్‌ఫెర్నో (2016) సినిమాలు ముఖ్యమైనవి. అన్నీ బాగా ఆడిన సినిమాలే. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగుండడం లేదు. క్యాన్సర్ వచ్చింది. తగ్గిందన్నారు. ఏదోరకంగా అంగ్రేజీ మీడియం (2020)లో నటించాడు. గతనెల 13 న సినిమా విడుదలైంది. కరోన దెబ్బతో థియేటర్లు మూతపడడంతో స్ట్రీమింగ్‌కు మారింది. అదే ఇర్ఫాన్ చివరకి సినిమా అవుతుందని ఎవరూ ఊహించలేదు. మొన్న శనివారం తల్లి సయీదా కన్నుమూశారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా వెళ్లలేదన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తల్లికి నివాళులు అర్పించాడన్నారు. ఇప్పుడు దేశమే తనకు నివాళులు అర్పిస్తున్నది.


logo