Google Search Movie | గతేడాది కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. లాక్డౌన్లు, సీటింగ్ కెపాసిటీపై ఆంక్షల కొనసాగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది థియేటర్లలోకి మళ్లీ జనం క్యూకడుతున్నారు. ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇదిలా ఉండగా.. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో భారతీయులు ఎక్కువగా వెతికారన్న వివరాలను గూగుల్ ప్రకటించింది. ఈ ఏడాది సినిమాల విభాగం భారతీయులు ఎక్కువగా వెతికిన సినిమా బ్రహ్మాస్త్ర పార్ట్-1 శివ.
ఈ చిత్రంలో రణిబీర్ కపూర్ – ఆలియాభట్ నటించిన విషయం తెలిసిందే. రెండోస్థానంలో కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్-2 కోసం ఎక్కువ మంది భారతీయులు వెతికారట. ఆ తర్వాతి స్థానాల్లో కశ్మీర్ ఫైల్స్, ఆర్ఆర్ఆర్, కాంతారా, పుష్ప, విక్రమ్, లాల్‌సింగ్ చద్దా, దృశ్యం, థోర్: లవ్ అండ్ థండర్ సినిమాలు నిలిచాయి. ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల జాబితాల్లో బ్రహ్మాస్త్ర అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత కేజీఎఫ్-2, కశ్మీర్ ఫైల్స్ గురించి ఎక్కువగా చర్చ జరిగింది. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ జపాన్‌లో విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఎలాంటి అంచనా లేకుండా వచ్చిన సినిమా కాంతారా. రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం విజయాన్ని అందుకుంది. గూగుల్ సెర్చింగ్‌లో ఐదోస్థానంలో నిలిచింది.
ఆ తర్వాత అల్లు అర్జున్ పుష్ప చిత్రం 2021 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఇటీవల రష్యాలో విడుదలై మరోసారి వార్తలకెక్కింది. ఇక కమల్ హసన్ నటించిన విక్రమ్ సినిమా తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో ఏడో స్థానంలో నిలిచింది. ఇక అమిర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. చిత్రం పలు వివాదాలతో ట్రెండింగ్‌లో నిలువగా.. గూగుల్ సెర్చ్ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక అజయ్‌దేవ్ గన్ దృశ్యం-2 తొమ్మిదో స్థానంలో, హాలీవుడ్ సినిమా థోర్: లవ్ అండ్ థండర్ పదో స్థానంలో నిలిచాయి.