బుధవారం 02 డిసెంబర్ 2020
Cinema - Oct 23, 2020 , 01:33:54

గోండు బెబ్బులి కొమురం భీం

గోండు బెబ్బులి కొమురం భీం

జల్‌ జంగల్‌ జమీన్‌ నినాదంతో తెలంగాణ గడ్డమీద ఆదివాసీల హక్కుల కోసం రణం సాగించిన గోండు వీరుడు కొమురం భీం 119వ జయంతిని పురస్కరించుకొని ‘ఆర్‌ఆర్‌ఆర్‌' ( రౌద్రం రణం రుధిరం) చిత్రంలోని ఎన్టీఆర్‌ పాత్ర తాలూకు టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ‘రామరాజు ఫర్‌ భీమ్‌' పేరుతో రూపొందిన ఈ టీజర్‌ను రామ్‌చరణ్‌ విడుదల చేశారు. కొమురం భీం ధీరత్వాన్ని అభివర్ణిస్తూ ఈ టీజర్‌ రొమాంచితంగా సాగింది. కొమురం భీంగా ఆరుపలకల దేహంతో ఎన్టీఆర్‌ శక్తివంతంగా కనిపించారు. ఆద్యంతం రౌద్రరసభరితంగా సాగిన ఈ టీజర్‌లో ‘వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా..వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ..వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ..నా తమ్ముడు, గోండు బెబ్బులి కొమురం భీం’ అంటూ వాయిస్‌ఓవర్‌లో రామ్‌చరణ్‌ చెప్పిన సంభాషణలు ప్రధానాకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ పాత్రను నిప్పుతో పోల్చిన జక్కన్న, ఎన్టీఆర్‌ పాత్రను నీటితో పోల్చుతూ టీజర్‌ను శక్తివంతంగా తీర్చిదిద్దారు. టీజర్‌ చివరలో ముస్లిమ్‌ వేషధారణలో కొండపైకెక్కుతూ కనిపించారు ఎన్టీఆర్‌.

హైదరాబాద్‌లో చిత్రీకరణ..

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా పాన్‌ఇండియా స్థాయిలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ఓ కథానాయికగా నటిస్తున్న అలియాభట్‌ నవంబర్‌ నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతున్నది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.  కొమురం భీం, అల్లూరి సీతారామరాజు చారిత్రక ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.