బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 27, 2020 , 00:02:36

జీవితంలో మరపురాని ఘట్టం ఘటోత్కచుడు

జీవితంలో మరపురాని ఘట్టం  ఘటోత్కచుడు

‘యమలీల’ ఘన విజయం అనంతరం దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, హాస్యనటుడు అలీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘ఘటోత్కచుడు’. సోషియోఫాంటసీ ఇతివృత్తానికి ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో పాటు సాంకేతికతను జోడించి ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.  మనీషా ఫిలిమ్స్‌ బ్యానర్‌పై  కిషోర్‌ రాఠీ సమర్పణలో అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఘటోత్కచుడిగా సత్యనారాయణ చక్కటి అభినయం,   అలీ, రోజా కెమిస్ట్రీ, బ్రహ్మానందం, ఏవీఎస్‌, తనికెళ్లభరణి  పండించిన హాస్యం చిత్ర విజయంలో కీలకభూమిక పోషించాయి.  నేటితో ఈ సినిమా విడుదలై ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ ‘ఈ చిత్ర నిర్మాణం నా జీవితంలో ఓ మరపురాని ఘట్టం. ‘యమలీల’ తర్వాత అలీకి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఇది.    ముఖ్కంగా ఘటోత్కచుడు, చిన్నారి మధ్య వచ్చే భావోద్వేగాలు మనసుల్ని కదిలించాయి. హీరో నాగార్జున ప్రత్యేక గీతం సినిమా రేంజ్‌ను పెంచింది. అలాగే ప్రారంభంలో వచ్చే కురుక్షేత్రం యుద్ధ సన్నివేశాలు సినిమాకు మల్టీస్టారర్‌ లుక్‌ను తెచ్చిపెట్టాయి. ఈ సన్నివేశాల్లో కర్ణుడిగా రాజశేఖర్‌, అర్జునుడిగా శ్రీకాంత్‌, కృష్ణుడిగా చక్రపాణి కనిపించి మెప్పించారు.  ఎస్వీ కృష్ణారెడ్డి స్వరపరచిన ‘అందాల అపరంజి బొమ్మ..’, ‘భామరో నన్నే ప్యార్‌ కరో..’, ‘జజజ్జరోజా..’తో పాటు ప్రతి పాట ఆణిముత్యంలా  శ్రోతల్ని రంజింపజేసింది. ఇలాంటి మంచి సినిమా మా సంస్థలో రూపుదిద్దుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి సినిమా చూసి చాలా మంది ఫోన్‌ చేసి అభినందిస్తూనే ఉంటారు’ అని తెలిపారు. 


logo