శుక్రవారం 03 జూలై 2020
Cinema - Jul 01, 2020 , 08:20:03

బాలీవుడ్ హీరోకి జెనీలియా స‌పోర్ట్‌..!

బాలీవుడ్ హీరోకి జెనీలియా స‌పోర్ట్‌..!

కరోనా ప్రభావానికి ముందు నేరుగా సినిమాల్ని ఓటీటీలో విడుదల చేసే ట్రెండ్‌ లేదు.  మార్చి నెలలో థియేటర్‌లు మూతపడటంతో ఓటీటీ ప్రత్యామ్నాయ వేదికగా మారింది. సినిమాల విడుదల కోసం దర్శకనిర్మాతలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయించడం మొదలుపెట్టారు.  అమితాబ్‌బచ్చన్‌, ఆయుష్మాన్‌ఖురానా నటించిన ‘గులాబోసితాబో’,  కీర్తిసురేష్‌ ‘పెంగ్విన్‌', జ్యోతిక ‘పొన్‌మగల్‌వంధాన్‌' ‘కృష్ణ అండ్‌హిజ్‌ లీల’ లాంటి కాన్సెప్ట్‌ ఓరియెంటెండ్‌ సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇక   ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సంస్థ డిస్నీ హాట్‌స్టార్‌.. ‘బాలీవుడ్‌కీ హోమ్‌డెలివరీ’ అంటూ 7 హిందీ సినిమాలను హాట్‌స్టార్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

అక్షయ్‌ కుమార్‌ నటించిన లక్ష్మీ బాంబ్‌(కాంచన రీమేక్‌), అజయ్‌ దేవగణ్‌ ‘భూజ్‌’, అలియా భట్‌ సడక్‌-2, దివంగత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ దిల్‌ బేచారా, అభిషేక్‌ బచ్చన్‌ ‘ది బిగ్‌బుల్‌’ సినిమాలతో పాటు ద్యుత్‌ జమాల్‌ ‘ఖుదా హాఫీజ్‌’, కునాల్‌ కేము ‘లూట్‌ కేస్‌’ తదితర సినిమాలు ఓటీటీలో విడుద‌ల కానున్న‌ట్టు తెలిపింది డిస్నీ హాట్ స్టార్. అయితే ఈ సినిమాల ప్ర‌మోష‌న్‌లో భాగంగా వ‌రుణ్ ధావ‌న్‌.. అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్, అభిషేక్‌ బచ్చన్, ఆలియా భట్‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించాడు. దీనికి విద్యుత్‌ జమాల్‌, కునాల్‌ కేముల‌కి ఆహ్వానం అంద‌లేదు.

ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌హనం వ్య‌క్తం చేశాడు విద్యుత్‌. దీంతో అత‌నికి నెటిజ‌న్స్ నుండే కాక కొంద‌రు సెల‌బ్రిటీల నుండి మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. జెనీలియా త‌న ట్వీట్‌లో ప్ర‌తి సినిమా ఎంతో మంది క‌ష్టంతో రూపొందుతుంది. సినిమా కోసం త‌మ స‌ర్వ‌స్వాల‌ని దార‌బోస్తారు. అలాంటి వారు కొంత గౌర‌వాన్ని కోరుకుంటారు. ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌కి ఇన్విటేష‌న్ కూడా వ‌స్తే బాగుండ‌ని ఆశిస్తారు. కానీ, కొన్నిసార్లు జీవితమే సరిగ్గా ఉండదు. ముందుకు సాగిపోవాలి అంతే ఫ్రెండ్ అంటూ జెనీలియా త‌న ఫ్రెండ్ విద్యుత్‌కి స‌పోర్ట్‌గా నిలిచింది.  కాగా జెనీలియా, విద్యుత్‌ జమాల్..‌ ఫోర్స్‌(వెంకటేష్‌ ఘర్షణ రీమేక్‌) సినిమాలో క‌లిసి న‌టించిన విష‌యం తెలిసిందే.


logo