బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 18:36:11

డ్రగ్స్‌ ఆరోపణలపై బాలీవుడ్‌ గుర్రు.. న్యూస్‌ చానళ్లపై కోర్టులో దావా

డ్రగ్స్‌ ఆరోపణలపై బాలీవుడ్‌ గుర్రు..  న్యూస్‌ చానళ్లపై కోర్టులో దావా

ముంబై: రెండు జాతీయ న్యూస్‌ చానళ్లతోపాటు నలుగురు జర్నలిస్టులకు వ్యతిరేకంగా 38 బాలీవుడ్‌ నిర్మాణ సంస్థలు కోర్టులో దావా వేశాయి. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం కేసు నేపథ్యంలో బాలీవుడ్‌ మొత్తానికి డ్రగ్స్‌ వ్యవహారాన్ని ఆపాదించడంతోపాటు బాధ్యతా రహితంగా రిపోర్టింగ్ చేసిన రిపబ్లిక్‌ టీవీ, ఆ చానల్‌కు చెందిన అర్నాబ్ గోస్వామి, ప్రదీప్ భండారితోపాటు టైమ్స్‌ నౌ, ఆ న్యూస్‌ చానల్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టులు రాహుల్ శివశంకర్, నవికా కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. షారూఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, కరణ్ జోహార్, అక్షయ్ కుమార్, ఆదిత్య చోప్రా, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్‌తో పాటు పలు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలతోపాటు అన్ని ప్రధాన బ్యానర్‌ల ప్రొడక్షన్ హౌస్‌లు సంయుక్తంగా పిటిషన్‌ దాఖలు చేశాయి. ఫిల్మ్, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (పీజీఐ), సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా ఈ దావాలో చేరాయి. 

బాలీవుడ్‌ పరిశ్రమలోని వారందరినీ డ్రగిస్టులు, చెత్త, మలినం, చెడ్డవారిగా చిత్రీకరిస్తూ అవమానకరంగా వ్యాఖ్యానించడం, ఆ విధంగా వార్తా కథనాలను ప్రచారం చేయడంపై 38 నిర్మాణ సంస్థలు మండిపడ్డాయి. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమతోపాటు నటీనటులపై అవమానకర, బాధ్యతారహిత, తప్పుడు, పరువునష్టం కలిగించే కథనాలను ఆయా మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచురణ కాకుండా అడ్డుకోవాలని కోర్టును కోరాయి. సినీ ప్రముఖులపై మీడియా ట్రయల్స్, వారి గోప్యతను ఉల్లంఘించకుండా మీడియాను నిరోధించాలని కోర్టును అభ్యర్థించాయి. 

ముంబైలోని హిందీ చిత్ర పరిశ్రమతో కూడిన బాలీవుడ్.. ఒక ప్రత్యేకమైన, మంచి గుర్తింపు పొందిన వినోదానికి సంబందించిన వ్యవస్థ అని చిత్ర నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి. ప్రజా ఖజానాకు భారీ ఆదాయ వనరుగాను, విదేశీ సినిమాలు, పర్యాటక రంగాల  ద్వారా భారతదేశానికి గణనీయమైన విదేశీ మారకద్రవ్యం సంపాదిస్తూ కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపాయి. పూర్తిగా ప్రేక్షకుల ప్రశంసలు, వారి ఆధారాభిమానాలపైనే సినీ పరిశ్రమ ఆధారపడి ఉన్నదని, అలాంటి బాలీవుడ్‌పై ఈ విధమైన తప్పుడు, అసభ్య ప్రచారం చేయడం, బురద చల్లడం తగదని ఆయా నిర్మాణ సంస్థలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో 1994 ప్రోగ్రామ్ కోడ్‌కు న్యూస్‌ చానల్స్‌ కట్టుబడి ఉండాలని, బాలీవుడ్‌కు, కొందరు నటులకు వ్యతిరేకంగా ప్రచురించిన, పరువు నష్టం కలిగించే విషయాలను ఉపసంహరించుకోవాలని చిత్ర నిర్మాతలు డిమాండ్ చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo