ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Dec 21, 2020 , 00:41:04

సామాజిక దృక్పథంతో తీసిన సినిమా: వై.వి.సుబ్బారెడ్డి

సామాజిక దృక్పథంతో తీసిన సినిమా: వై.వి.సుబ్బారెడ్డి

‘చేతివృత్తుల కళాకారులను ప్రోత్సహించాలనే సామాజిక దృక్పథంతో సినిమాను నిర్మించడం అభినందనీయం. నిర్మల్‌ కొయ్య బొమ్మల కళాకారుల నైపుణ్యాల్ని, వారు పడుతున్న ఇబ్బందులను వాస్తవిక కోణంలో ఈ సినిమాలో చూపించారు’ అని అన్నారు టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి. అనురాగ్‌, ముస్కాన్‌ సేథీ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధాకృష్ణ’. టి.డి. ప్రసాద్‌వర్మ దర్శకుడు. పుప్పాల సాగరిక నిర్మాత. లక్ష్మీపార్వతి కీలక పాత్రను పోషించారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లేను అందించారు.  ఈ చిత్ర ట్రైలర్‌ను ఆదివారం వై.వి.సుబ్బారెడ్డి విడుదలచేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యం ఉన్నా  సరైన ప్రోత్సాహం లేక ఎంతో మంది కళాకారులు జీవనోపాధిని కోల్పోతున్నారు.  ఈ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని సినిమా చేయాలన్న ఆలోచన బాగుంది. మంచి ఆశయంతో తీసిన ఈ సినిమాను రెండు రాష్ర్టాల ప్రేక్షకులు ఆదరించాలి’ అని తెలిపారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ‘శ్రీనివాసరెడ్డితో చాలా కాలంగా పరిచయం ఉంది. ఆయన పట్టుబట్టి ఈ సినిమాలో నాతో చక్కటి పాత్ర చేయించారు. మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రమిది’ అని చెప్పారు. ‘నిర్మాతగా నా తొలి ప్రయత్నమిది. లక్ష్మీపార్వతి క్యారెక్టర్‌ కథలో కీలకంగా ఉంటుంది.  శ్రీలేఖ చక్కటి పాటలను అందించారు. అనురాగ్‌, ముస్కాన్‌సేథీ తమ పాత్రలకు పరిపూర్ణంగా న్యాయం చేశారు. జనవరిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని నిర్మాత పేర్కొన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ‘సెన్సార్‌  సభ్యులు మంచి సినిమా తీశామని ప్రశంసించారు. సింగిల్‌ కట్‌ లేకుండా క్లీన్‌ ‘యు’ సర్టిఫికెట్‌ ఇచ్చారు. తప్పకుండా సినిమా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముంది’ అని చెప్పారు. నిర్మల్‌ నేపథ్యంలో వచ్చే ఈ అందమైన ప్రేమకథలో ఐదు పాటలుంటాయని సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ అన్నారు. ఈ కార్యక్రమంలో అనురాగ్‌, ముస్కాన్‌సేథీ, అలీ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo