శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 05, 2021 , 17:47:24

టాలీవుడ్‌లో విషాదం.. సినీగేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం.. సినీగేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూత

హైదరాబాద్‌ : ప్రముఖ సినీగేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. వెన్నెలకంటి మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్‌. ఎస్‌. గోపాల్‌రెడ్డి తీసిన మురళీ కృష్ణుడు(1988) మూవీతో వెన్నెలకంటి తెలుగు చిత్రసీమకు గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఈ మూవీలో ఆయన రాసిన పాటలు సూపర్‌ హిట్‌ అవడంతో వెన్నెలకంటికి మంచి పేరు, గుర్తింపు వచ్చింది. మహర్షి చిత్రంతో వెన్నెలకంటికి గీత రచయితగా గుర్తింపు వచ్చింది. డబ్బింగ్‌ చిత్రాలకు పాటలు రాయడంలో వెన్నెలకంటి ప్రసిద్ధి. 

అనేక మేటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు పాపులర్‌ అయ్యాయి. దాదాపు 2 వేల పాటలు రాశారు వెన్నెలకంటి. ఆదిత్యా 369, తీర్పు, క్రిమినల్‌, శీను, టక్కరి దొంగ, మిత్రుడు, రాజా తదితర చిత్రాలకు ఆయన రాసిన పాటలు అభిమానులను ఉర్రూతలూగించాయి. చెట్టుకింద ప్లీడరు, నాయకుడు, ఔను వాళిద్దరూ ఇష్టపడ్డారు, ఏప్రిల్‌ 1 విడుదల, బృందావనం, స్వాతికిరణం వంటి చిత్రాలు వెన్నెలకంటికి మంచి పేరు తెచ్చాయి. డైలాగ్‌ రైటర్‌గా పంచతంత్రం, మొనాలీసా, దశావతారం, ప్రేమ ఖైదీ వంటి తమిళ చిత్రాలకు తెలుగులో డైలాగులు రాశారు. ఈయన పెద్ద కుమారుడు శశాంక్‌ వెన్నెలకంటి కూడా సినీ డైలాగ్‌ రైటరే. చిన్న కుమారుడు రాకేందు మౌళి లిరిసిస్టుగా, సింగర్‌గా, నటుడిగా రాణిస్తున్నారు.

VIDEOS

logo