శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 26, 2020 , 03:17:03

సినీలోకం శోక సంద్రం

సినీలోకం శోక సంద్రం

గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం అస్తమయంతో భారతీయ చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విని సినీలోకం దిగ్భ్రాంతికిలోనయింది.  అమృతగళంతో తరాల్ని ఓలలాడించిన అమరగాయకుడు బాలు అంటూ సినీ ప్రముఖులు కన్నీటినివాళులర్పించారు. బాలసుబ్రహ్మణ్యంతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు.

పాటలన్నీ విజయవంతమయ్యాయి: కృష్ణ

బాలు మనమధ్య లేకపోవడం దురదృష్టకరం. నేను నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంలోని అన్ని పాటల్ని  బాలు చేత పాడిద్దామని ఎస్‌.పి.కోదండపాణి సూచించారు. నేను, చిత్ర దర్శకుడు డూండీ ఆయన ప్రతిపాదనకు అంగీకరించాం. ఆ సినిమాలో బాలు పాడిన పాటలన్నీ విజయవంతమయ్యాయి.  ఘంటసాల బతికున్న రోజుల్లో  కూడా నా సినిమాల్లో బాలు పాటలు పాడేవాడు. బాలు కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను. బాలుతో ముడిపడిన జ్ఞాపకాలు, పంచుకున్న భావాలు తలచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు. బాధగా ఉంది. దాచుకో స్వామి మా బాలును జాగ్రత్తగా దాచుకో. 

స్మృతులు నిలిచే ఉంటాయి: మహేష్‌బాబు

బాలసుబ్రహ్మణ్యం ఇకలేరనే చేదువార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన అమృతస్వరానికి సాటి ఎవరూలేరు. బాలు స్మృతులు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. 

ఆరాధ్యస్వరం మూగబోయింది: ఎన్టీఆర్‌            

తెలుగువారి ఆరాధ్యస్వరం మూగబోయింది. సంగీతం తన ముద్దుబిడ్డను కోల్పోయింది. ఎన్నో పాటలకు జీవం పోసిన బాలసుబ్రహ్మణ్యం ఇకలేరనే వార్త తీవ్రంగా కలచివేసింది. 

 షాక్‌కు గురిచేసింది: రామ్‌చరణ్‌

ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే బాలసుబ్రహ్మణ్యం గారు మరణించారనే వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. సంగీతప్రపంచానికి, సినీ పరిశ్రమకు ఆయన లేని లోటును ఊహించడం కష్టంగా ఉంది. 

 అదృష్టం దక్కింది: వెంకటేష్‌

దిగ్గజ గాయకుడిని కోల్పోవడం బాధాకరం. ‘ప్రేమ’ ‘పవిత్రబంధం’తో పాటు ఎన్నో మంచి సినిమాల్లో ఆయనతో కలిసి నటించే అదృష్టం నాకు దొరికింది. బాలు కుటుంబానికి నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నా.

బాలుగారు నాకు అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడు. నేను అన్నయ్య అని పిలిచే నా కుటుంబసభ్యున్ని పోగొట్టుకున్న భావం కలుగుతోంది. సంగీత ప్రపంచానికి ఇది ఒక దుర్దినం. బాలు స్థాయిని భర్తీ చేయాలంటే మళ్లీ ఆయనే పునర్జన్మించాలి. నా విజయాల్లో ఆయనకు సింహభాగం ఇవ్వాలి. నా పాటలు పాపులర్‌ కావడానికి కారణంగా బాలు గళమే. ఆ మహానుభావుడికి ఏ రకంగా నేను నివాళి అర్పించగలను. మళ్లీ బాలు లాంటి మనిషిని ఈ పరిశ్రమ పొందటం దుర్లభం. బాలు తాను పాడిన పాటల ద్వారా ప్రతి రోజు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.                                               

 -చిరంజీవి 

జ్ఞాపకాలు ఉండిపోతాయి: రజనీ

భారతీయ భాషలన్నింటిలో పాటలు పాడి  దేశవ్యాప్తంగా అసంఖ్యాక అభిమాన      గణాన్ని సొంతం చేసుకున్న దిగ్గజ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం.  అపార ప్రతిభాసంపత్తులు కలిగిన మహోన్నత వ్యక్తిత్వమున్న మనిషి. మంత్రముగ్ధమైన ఆయన అమృతస్వరం శతాబ్దాల పాటు  నిలిచే ఉంటుంది. గత కొన్నేళ్లుగా మీరు నా స్వరం అయ్యారు. మీ  జ్ఞాపకాలు, పాటలు ఎప్పటికీ నాతో ఉండిపోతాయి.  బాలు దూరమవ్వడం బాధాకరం.

నా ఆరోప్రాణం-విశ్వనాథ్‌

భగవంతుడు బాలు విషయంలో ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు. బాలు నా సోదరుడు. నా ఆరోప్రాణం. ఇలాంటి విషాదసమయంలో మాటలు రావడం లేదు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలి.  సంగీతప్రపంచానికి లోటు: ఆశాబోంస్లే

బాలు మరణవార్త నన్ను ఎంతగానో కలిచివేసింది. లతా మంగేష్కర్‌తో కలిసి  బాలు ఎన్నో అజరామరమైన పాటల్ని పాడారు. ఇళయరాజా స్వరకల్పనలో తమిళంలో నేను పాడిన పాటల విషయంలో భాషను పలకడంలో ఎంతో సహాయం చేశారాయన. బాలు మరణం సంగీతప్రపంచానికి గొప్ప లోటు.           

గొప్ప కళాకారున్ని కోల్పోయాం: ఆమీర్‌ఖాన్‌

బాలసుబ్రహ్మణ్యం మరణవార్త ఎంతగానే భాధించింది  అత్యంత ప్రతిభావంతుడైన కళాకారుడిని కోల్పోయాం. శకం ముగిసింది: మాధురిదీక్షిత్‌

గొప్ప శకం ముగిసింది. మీ గళం ఎప్పటికీ మా మనసుల్లో నిలిచే ఉంటుంది. మీ కీర్తి అజరామరం.

మానవతావాది బాలు: అనిల్‌కపూర్‌

నా తొలి తెలుగు, కన్నడ చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు బాలసుబ్రహ్మణ్యం.  గొప్ప గాయకుడు, మానవతావాది.  

మధురగళం దూరం: షారుఖ్‌ఖాన్‌

బాలు మధుర గళాన్ని మిస్సవుతున్నాం. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.

సేవలు గుర్తుండిపోతాయి: సల్మాన్‌ ఖాన్‌

సంగీతప్రపంచానికి చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బాలు కుటుంబసభ్యులకు నా ప్రగాఢసానుభూతి.

బాలుగారు తెలుగు, తమిళం, కన్నడ బాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించారు.  ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు.                     

  -రాజమౌళి

అమృతం గొంతు నిండా నింపుకున్న స్వరం బాలు గారిది.  

-పవన్‌కల్యాణ్‌                          

నాకు ఆత్మీయుడు. ఆప్తమిత్రుడు బాలసుబ్రహ్మణ్యం. మేమిద్దరం శ్రీకాళహస్తిలో కొన్నాళ్లు కలిసి చదువుకున్నాం.               

-మోహన్‌బాబు                                       

కొందరికి వయసు రాదు. మరణం ఉండదు. అలాంటి వారిలో బాలు ఒకరు. ఆయన పాట చిరస్మరణీయం.                         

-త్రివిక్రమ్‌                                                 

సంగీతప్రపంచంలో నిశ్శబ్దం ఆవరించింది. సరిగమలు కన్నీళ్లు పెడుతున్నాయి. బాలు లేని లోటు తీర్చలేనిది.                 

-రాఘవేంద్రరావు                                           

ఓ శకం ముగిసింది. నేను ఉత్తమగాయనిగా మారేందుకు ఆయన చేసిన సాయానికి ధన్యవాదాలు చెప్పడానికి మాటలు సరిపోవు.       

-చిత్ర 

బాలుగారి నిష్క్రమణ యావత్‌ సినీ సంగీత ప్రపంచానికే తీరనిలోటు.                                                         

-బాలకృష్ణ

అందరి మంచిని కాంక్షిస్తూ అందరితో ప్రేమతో  మసలుకుంటూ సమాజశ్రేయస్సు కోరి ఎన్నో గొప్ప పనులు చేసిన బాలు లేని లోటు ఎప్పటికీ తీరనిది.                                                         

-కీరవాణి                                            


logo